పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

392

అంటివా నాకుద్యోగము రాగలదు" అనెను. గంగాబాయి ఆరాత్రియే రాజుగారితో చెప్పెదనని వాగ్దానము చేసినది. చూచితిరా! మరునాటివేకువజాముననే బ్రాహ్మణుని యింటికి రాజభటుడువచ్చి ఆనాటినుండియే ఉద్యోగమందిరమునకురమ్మని రాజుగారియుత్తర్వును తెలిపిపోయినాడు! రాజు మంత్రితో "చూడుడు! ఈబ్రాహ్మణుడు చాల బుద్ధికుశలుడు. వీనిసేవ మనకు లాభకరముగ నుండును గాన ఉద్యోగము నిచ్చితిని. ప్రవేశపెట్టుకొనుడు" అని బ్రాహ్మణుని మంత్రిపరిచయముచేసినాడు. స్త్రీమోహమునకు పురుషునిపైనట్టి శక్తికలదు. జగమంతయు కామినీకాంచనాధీనమైయున్నది!

998. ఒక బాలసన్యాసి బిక్షకై ఒక గృహస్థునియింటికి పోయినాడు. అతడు చాలచిన్నతనమునందే సన్యసించుటచేత వానికి లోకజ్ఞానము కొఱవడియుండెను. ఒకయువతి బిక్ష పెట్టరాగా, ఆమెస్తనయుగ్మమునుచూచి, నీకేమైన రొమ్మున వ్రణములు లేచినవాయని ప్రశ్నించినాడు. ఆమాటలు ఆయువతి తల్లివిని "లేదులేదు, బిడ్డా! ఆమెకవి వ్రణములుకావు త్వరలోనే భగవంతుడు ఆమెకు ఒక బిడ్డను దయచేయనున్నాడు. ఆబిడ్డకు పాలిచ్చునిమిత్తము ముందుగనే ఆమెకు రెండు స్తనములను అనుగ్రహించినాడు. బిడ్డపుట్టినప్పుడు ఆస్తనములనుండి పాలు త్రాగ గలడు." అని చెప్పినది. ఈపలుకులాలకించగనే ఆబాలసన్యాసి" ఇక నేనుతిండికై యింటింట తిరుగను. నన్ను సృజించినవాడే నాకు తిండినొసగగలడు!" అనిపలికెను.