పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

385

41వ అధ్యాయము.

పడిపోయినప్పుడు పల్లెవాండ్రు వలలో వెలికితీయబడుట తటస్థించినది. అప్పుడు వారాయనను స్పృశించుటవలన వారికొక విధమగు మైకముకలిగినది. వారంతట తమపనిపాటలను విడిచివేసి హరినామస్మరణముచేయుచు పిచ్చెత్తినవడుపున ఆటలాడసాగిరి. వారి బంధుమిత్రాదులు వారికి చికిత్సచేయు విధమును తెలియక శ్రీ గౌరాంగదేవునికడకువచ్చి దుఃఖించిరి. శ్రీ చైతన్యులవారప్పుడు మీరుపోయి యేఅర్చకుని యింటనైన కొంచెము అన్నముతెచ్చి వారినోటిలో పెట్టుడు. వారి మైకముతగ్గిపోవును పొండు" అనిరి. పల్లెవాండ్ర బంధుగులు అటులచేయగా వారిదివ్యానంద పారవశ్యము తగ్గిపోయినది.

991. మాయ యిట్టిదని తెలియరానిది. ఒకనాడు నారదుడు శ్రీహరిని సమీపించి "స్వామీ! అసాధ్యములను సాధ్యములుగనొనర్చు నీమాయను నాకు చూపుము" అని వేడుకొనెను. శ్రీహరి వల్లెయని తలయూచినారు. కొన్నాళ్లైన పిమ్మట నారదుని వెంటదీసికొని ప్రయాణమైపోవుచు దారిలో శ్రీహరి దప్పిగొనిరి. చాలడస్సికూర్చుండి "నారదా! నాకు దప్పి హెచ్చుగనున్నది. ఎచ్చటికైనపోయి కొంచెము నీరు తెమ్ము" అని చెప్పిరి. వెంటనే నారదుడు నీటికై వెదకుచు పరుగిడిపోయినాడు.

దాపున ఎక్కడను నీరు చిక్కలేదు. చాలాదూరము పోగా ఏరొకటి యున్నటుల ఎదుటకాన్పించినది. నారదుడా ఏటియొద్దకుపోగా వానికొక సుందరాంగి నీటిదాపున కూర్చుండి కానవచ్చినది. నారదుడు మోహానిష్టుడైనాడు.