పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

376

రుదొంగలు. జీవుడే బాటసారి. ఆత్మజ్ఞానమే వానిసొత్తు. తమోగుణము జీవుని నాశనముచేయ జూచును; రజోగుణము సంసారబంధనమున చిక్కించును. సత్వగుణము వానిని రజస్తమస్సుల బారినుండి రక్షించును. సత్వగుణముయొక్క శరణుజొచ్చి జీవుడు తమోగుణబంధములగు కామక్రోధాదుల నుండి విడివడును. సత్వగుణము జీవుని సంసారబంధనములన్నిటినుండియు విడిపించును. కాని సత్వగుణముసయితము దొంగయే. అయినను అది జీవునికి పరమాత్మనుజేరు మార్గమునుజూపి "అదిగో నీయిల్లు!" అని మాత్రము తెలుపును. అంతట అదియు అదృశ్యమగును. ఈసత్వగుణముసయితము పరమాత్మ సమీపమునకు పోజాలదు.

981. భగవత్సాక్షాత్కారమును పొందవలయునని యిద్దరు యోగులు సాధనలుచేయుచుండిరి. నారదుడు వారి పర్ణశాలమీదుగా పోవుచుండుట తటస్థించెను. వారిలో నొకడు నారదునితో నీవు స్వర్గమునుండి వచ్చుచుంటివా అనెను. నారదుడు ఔననగా, ఆయన స్వర్గాధినాధుడు ఏమిచేయుచుండగా చూచితివని అడిగెను. నారదుడు అంతట "లొట్టిపిట్టలను ఏనుగులను భగవంతుడు సూదిబెజ్జముగుండ దూర్చుచుండ చూచితిని!" అనెను. "దానిలో ఆశ్చర్యపడదగిన అంశములేదు. భగవంతునికి అసాథ్యకార్యమేముండును?" అని ఆయోగిపలుకగా, రెండవయోగి "వెఱ్ఱిమాట! అది అసంభవము! దీనివలననీవు భగవత్సాన్నిధ్యమునకు పోనేలేదని రుజువగుచున్నది" అనెను.