పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

374

డను మాటాడదయ్యె. పిల్లవాడుచాలసేపు అటులనే వేచియుండెను. ఆదేవత పీఠముదిగివచ్చి నై వేద్యముపెట్టిన పళ్లెరము చెంతకూర్చుండి, దానిని తినునని ఆపిల్లవాని దృఢవిశ్వాసము! అంతనాతడు "ఓదేవా! రమ్ము ఆరగింపుము! చాల ఆలస్యమగుచున్నది; నేనింక వేచియుండ జాలను" అని ప్రార్థించ మొదలిడెను. కాని భగవంతుడు పలుకలేదు. ఆబాలుడప్పుడు "భగవంతుడా! నీవీనై వేద్యమును ఆరగింపగా కనిపెట్టియుండుమని నాతండ్రి ఆజ్ఞాపించియున్నాడు. నీవేలరావు? నీవు నా తండ్రికడకువచ్చి ఆయన అర్పించుదానిని ఆరగింతువుగదా! నీవువచ్చి నేను అర్పించుదానిని గ్రహింపకుండుటకు కారణమేమి? నానేరమేమి? అనుచు ఏడ్వసాగెను. ఆవిధముగా చాలసేపు వెక్కి వెక్కి ఏడ్చినాడు. అంతట దేవతాపీఠమువంక కనువిచ్చిచూడగా, భగవంతుడు నరరూపమునవచ్చి నివేదిత పదార్థములను తినుచుంట కాననయ్యెను. అటులదేవతార్చనను ముగించి బాలుడు వెలుపలికిరాగా, ఆ యింటివారు దేవతార్చన ముగిసినయెడల ప్రసాదమును తీసికొనిరమ్మనిరి. "అవును. దేవతార్చన ముగిసినది! భగవంతుడు అంతయు తినివేసినాడు!" అనిబాలుడు పలికెను. అందఱును నివ్వెరపోయి "ఏమనుచుంటివి!" అనిరి. సంపూర్ణనిష్కాపట్యము మోమున తాండవించగా బాలుడు "ఏమున్నది? భగవంతుడు నేను అర్పించినదాని నంతటిని ఆరగించినాడు" అనెను. అప్పుడువారు దేవతార్చనమందిరముప్రవేశించి వట్టివైయున్న పళ్లెరములగాంచి అద్భుతపడిరి!