పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

315

40వ అధ్యాయము.

907. ఒకపండితుడు:- దివ్యజ్ఞానసమాజమువారు మహాత్ములున్నారందురు. గంధర్వలోకము దేవయానలోకము సూర్యలోకము చంద్రలోకము అనుచు ఏమేమో లోకములున్నవనియు, నరుని లింగశరీరము వీనిలో సంచారముచేయగలదనియు అందురు. ఇట్టివిషయములు అనేకము వారు చెప్పుదురు. స్వామీ! ఈదివ్యజ్ఞానమునుగూర్చి మీ అభిప్రాయమేమి?

శ్రీపరమహంసులవారు:- భక్తియొక్కటి శ్రేష్ఠమైనది - భగవంతునియెడ అనురాగము. వారు భక్తిని ఆదరింతురా? ఆదరింతురేని మంచిదే. బ్రహ్మసాక్షాత్కారము తమ పరమార్ధముగ పెట్టుకొనిరా మంచిదే. కాని సూర్యలోకము, చంద్రలోకము, గంధర్వలోకము అను నిట్టి అల్పవిషయములందు మునిగియుండుట సత్యమగు బ్రహ్మసాధన కాదని మాత్రము జ్ఞప్తినుంచుకొనుడు. భగవత్పాదార విందముల యెడ భక్తికొఱకై తీవ్రసాధనలు చేయవలయును; హృదయము ఆవేదనపడునట్లు గావించవలయును! ఆయావిషయములందు పర్విడు మనస్సును మరల్చి భగవంతునిమీదికే త్రిప్పవలయును. భగవంతుడు వేదములలో లేడు. వేదాంతమునందులేడు. ఏశాస్త్రమునందును కానరాడు! నరుని హృదయము వానికొఱకై మహాపరితాపమును పొందినగాని ఏమియు ఫలము రాబోదు. సాంద్రభక్తితో దైవప్రార్థనలు చేయుచు, పారమార్థిక సాధనలను చేయవలయును. భగవంతుడు సులభముగా చిక్కువాడుకాడు. సాధనాత్యవసరము.