పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

314

903. కొందఱు, కొందఱితో మెలగునప్పుడు మనము జాగ్రత్తతో మెలగవలయును. (1) ధనికులు, వారికి ధనబలము, మనుష్యబలము, మఱియు ఇతరవిధబలము కలదు. వారుతలచుకొనిరేని నీకు అపకారము చేయగలరు. నీవువారితో జాగరూకుడవై మెలగవలయును. - వారుచెప్పుదానికెల్ల తలయూచి సరే అనవలసియురావచ్చును. (2) కుక్క. అది మొఱగినప్పుడును కఱవవచ్చినప్పుడును, ఆగిఈలవేసి దానిని శాంతిపఱచవలెను. (3) ఆబోతు. అది నిన్ను పొడవవచ్చినప్పుడు కొన్నిశబ్దముల చేసి దానిని శాంతిపఱచవలెను. (4) త్రాగుబోతు. వానిని రెచ్చకొట్టితివా అతడు నానానీచ బాషణములతో నిన్ను బూతులుతిట్టును. కాని "మామా! ఓహో! ఎట్లాఉన్నావు?" అనుచు వానిని బుజ్జగించిన యెడల వా డానందించును. నీదగ్గఱచేరి పొగద్రాగుచుస్నేహముచూపును.

904. కొందఱుపామునైజముకలవారుందురు. వారెప్పుడు కాటువేయునది నీకు తెలియదు. వారివిషమునకు విరుగుడుకనుక్కొనుటకు చాల శ్రమపడవలసియుండును. లేదా వారిమీద నీకు ఆగ్రహముపుట్టి నిను క్రోధావేశుని చేయును.

905. ఎవడు ఎటువంటి సహావాసగాండ్రతో తిరుగునో అటువంటిగుణములు వానికి అబ్బును. మఱియు ఎవనికెటువంటి గుణములుండునో అటువంటిసహవాసమునే అతడు కోరుకొనును.

906. "స్త్రీలమధ్య వసించుచును, వారిని ఎఱుగనట్టి జనుడు నిజముగ వీరుడు."