పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

313

40వ అధ్యాయము.

ఈనీటిలో ప్రతిబింబించుచున్నాడు. ఈరీతిగా భక్తులు ఆయా దేవతామూర్తులను చూచుచుందురు.

901. కాని వేదాంతము ప్రకారము బ్రహ్మము మాత్రమే సత్యము - మూలాధార వస్తువు; తదితరమంతయు మాయ - స్వప్నమువలె అసత్యము. బ్రహ్మమను సాగరమున తేలుచు "అహం" అను పుడకయున్నది. ఈపుడకను తీసివేసినయెడల అఖండమై ఒక్కనీరే వ్యాపించియుండును; ఆపుడక ఉన్నంతవఱకును దానిచేత రెండు భాగములుగా విభజింపబడినటుల కాన్పించుచు దానికి రెండువైపులను నీరుండును. బ్రహ్మజ్ఞానము కలుగగానె నరుడు సమాధి అవస్థను చెందును. "అహం" అనునది అదృశ్యమైపోవును. వేదాంత మతానుసారము జాగ్రత్తు సయితము అసత్యమే.

902. తల్లియు తండ్రియు నరునికి ప్రధానులు. వారు సంతుష్టులైనగాని ఏపూజలును ఫలించవు. చైతన్యస్వామి చరిత్ర చూడుడు. భగవద్భక్తి పరవశుడయ్యును, తాను సన్యాసమును స్వీకరించుటకు పూర్వము తల్లిని సమాధానపఱచవలసినవాడయ్యెను. "తల్లీ! దుఃఖపడకుము; అప్పుడప్పుడువచ్చి నిన్ను దర్శించుచుందును." అని చెప్పినాడు. నరుడు తీర్చవలసిన ఋణములున్నవి:- దేవతల ఋణము; ఋషులఋణము; జనకులఋణము; భార్యఋణము - ఎన్నో యున్నవి. తల్లిదండ్రులఋణమును తీర్చనియెడల ఏకర్మయు ఫలప్రదము కాజాలదు. భార్యయెడకూడ ఋణముండును.