పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

304

కలిసిన సత్వగుణము, ఆరజోగుణాంశమునుండి విడివడి శుద్ధసత్వముగా తుదిని మారును. ఇటుల శుద్ధసత్వగుణమును పడయుటచేత నరుడు బ్రహ్మసాక్షాత్కారమును పొందగల్గును. సామాన్యజనులకు శుద్ధసత్వమయదశ అనగా అర్థముకాదు.

876. పంచభూతములతో ఏర్పడిన ఈశరీరమును "స్థూలశరీరము" అందురు. సూక్ష్మశరీరము మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములతో కూడి ఏర్పడును. బ్రహ్మ దర్శనానందమును గ్రహించి బ్రహ్మైక్యానందమునందే నిలుచుట కనువగు శరీరము కారణశరీరము. తంత్రశాస్త్రమున దీనిని "భగవతీతనువం"దురు. ఈ అన్నింటికిని అతీతముగా నుండునది "మహాకారణము" - అది మూలకారణము.

877. భగవత్సాక్షాత్కారము కానిది "ప్రేమ" లభించదు.

878. బ్రహ్మసాక్షాత్కారమయిన చిహ్నములు కలవు. భక్త్యావేశము మీ కెవరియందు కాన్పించునో వారు బ్రహ్మపరోక్షానుభూతిని బడయుటలో ఆలస్యముండదని గ్రహించుడు.

879. భక్త్యావేశము వివేకరూపమునను, వైరాగ్యరూపమునను, సర్వభూతదయ, సాధుజనసేవ, భాగవతసంగము, హరినామకీర్తనము, సత్యసంధత, మొదలగు సద్గుణపూజ రూపమునను ప్రకాశించును.