పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

295

40వ అధ్యాయము.

853. మనస్సునిలుచు ఏడుస్థానముల (చక్రముల లేక పద్మముల) గురించి వేదములు చెప్పుచున్నవి. మనస్సుఐహిక విషయములగూర్చివిచారించునప్పుడుఅది లింగ, గుహ్య, నాభి స్థానములందుండును .ఆస్థితిలో మనస్సునకుఊర్ధ్వదృష్టియుండదు. కామినీకాంచనములపై వాంఛలతోనిండియుండును.

నాలుగవస్థానము హృదయము. మనస్సు ఈస్థానముచేరునప్పుడు ఆత్మప్రబోధము ప్రధమమున కలుగును. సాధకునకు ఒకవిధమైన తేజము ఎల్లెడలకాన్పించును. భయాద్భుతములుతోచును. ఈదశయందు మనస్సు ప్రాపంచికవిషయములకై అధోదృష్టిపూనదు.

కంఠము అయిదవస్థానము. మనస్సు ఈస్థానముచేరునప్పుడు అజ్ఞానము లేక అవిద్యఅంతయు నశించును. అప్పుడు భగవంతునిగూర్చి తప్ప యితరవిషయముల ప్రశంసవిన నిష్టముండదు. భగవంతునితప్ప ఇతరవిషయముల ప్రస్తాపము వచ్చెనేని సాధకుడాస్థలమును విడిచి వెడలిపోవును.

ఆరవస్థానము నొసలు ( భ్రూమధ్యము). మనస్సు ఈచక్రము జేరినప్పుడు రేయింబవళ్లు భగవద్విభూతులు గాన్పించుచుండును. అప్పుడును "అహం" నేను జ్ఞప్తికొంత యుండును. ఇచ్చట అసాధారణ దివ్యమహిమను చూచు నాతడు ఆనందపరవశుడై దానిం జేరవలయుననిఉత్సాహము పడును; కాని చేరలేడు. అది జ్యోతియొక్క తేజమును బోలియుండును. తాకుటకు వీలగునటుల కాన్పించును, గాని అద్దము అడ్డమై తాకనీయునట్లుండును.