పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

290

(3) చీమ నెమ్మదిగను పట్టుదలతోడను తన ఆహారమును వెదకిపట్టుకొనును. దానిని జాగ్రత్తగా తన పుట్టలోనికి చేర్చి సుఖముగా భుజించును. ఇట్టి చీమవర్తనమును బోలు సాధన శ్రేష్టమయినది. ఇందు ఫలప్రాప్తి నిశ్చయము.

830. పసిపిల్లలు తమ యొడళ్ళను ముఱికిచేసికొనుట వారి స్వభావము. కాని తల్లి వారినటుల నుండనీక తరుచుగా వారి శరీరములను కడుగుచుండును. అట్లే నరుడెంతగా పాపములు చేయుచున్నను, భగవంతుడు తుదకు వానికి తరుణోపాయమును చూపకతప్పదు.

831. చీకటి గదియొకటి కలదు. దానిలోనికి ఒక చిన్నరంధ్రముగుండా బైటనుండి వెలుగు కిరణమొకటి వచ్చుచుండెను. ఆగదిలోనుండు నరునకు వెలుగనగా ఆకిరణమే ననుభావము కలుగును. ఆతడు క్రమేణ కిటికితలుపులను ద్వారములను తెఱచుచు, లోపలికి వెలుగువచ్చు అవకాశములు హెచ్చుచేసినకొలదిని హెచ్చుగ వెలుగును చూడగలడు.

కాని బహిరంగమున పొలములో నిలుచున్నవానికి అంతా వెలుతురే!

ఈపోలికను భగవంతుడు బుద్ధియొక్క స్వభావ సమర్థతల ననుసరించి ప్రత్యక్షమగుచుండును.

832. నరుడు పరమాత్మను సమీపించినకొలదిని, ఎక్కువ ఎక్కువగా తన అనంతస్వభావ విభూతులను భగవంతుడు నవ్యతర ప్రత్యక్షము గావించుచుండును. తుదిని నరుడు జ్ఞాన పరిపాకమును బడసి పరమాత్మ యందైక్యము గాంచును.