పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

276

793. ఇతరులేమి చేయవలయునని నీవు కోరుదువో, దానిని నీవును జేయుము.

794. చిలుక ఎగిరిపోయినవెనుక ఎవడును పంజరముమీద శ్రద్ధవహించడు. ప్రాణమనెడు చిలుక ఎగిరిపోయిన వెనుక మిగిలియున్న కళేబరము ఎవరికిని అక్కఱలేదు.

795. ఎవరికిని కొఱగాని వానియందుకంటె, అనేకుల గౌరవ మర్యాదల బడయుచు, వినయవిధేయతలతో అనుసరించబడు నతనియందు దైవశక్తి అతిశయముగ నుండును.

796. తెల్లని గుడ్డమీద నల్లనిడాగు నలుసంతపడినను ఎంతో అసహ్యముగ గాన్పించును. అటులనే సాధువునందు చిన్నలోపమున్నను ప్రకాశమునకువచ్చి బాధకరమగును.

797. ఇతరులు శిరస్సువంచుతావున నీవును వంచుము. వినయవర్తనము వ్యర్థముగపోదు.

798. అద్దెయింటిలో కాపురమున్నయెడల బాడుగచెల్లించవలయు రీతిని, శరీరమునువాడుకొని నందుకు జీవుడు రోగపీడలనెడు పన్నులను చెల్లించుకొనవలయును.

799. ఇనుమును కొలిమిలోకఱగి చాలసేపు శుద్ధిచేసినగాని మంచిఉక్కుకాదు. అప్పుడు దానిని మంచికత్తిగాచేసి నీయిష్టమువచ్చినటుల ఎటుపట్టిన నటువంచవచ్చును. ఆతీరుననే మనుజుని ఆపదలను కొలిమిలో చాలసార్లుకాచి, బాధలనెడు సమ్మెటలతో మోదిన అనంతరము వాని హృదయము స్వచ్ఛమగును; వినయసంపత్తి గలదగును. అప్పుడతడు భగవత్సాన్నిధ్యమున మెలగుటకు అర్హుడగును.