పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

269

40వ అధ్యాయము.

రాత్రి ఆసన్నమైనప్పుడు అనేకయాతనలకు లోనై బహుదుఃఖము ననుభవించవలసివచ్చును.

762. మున్ముందుగా భగవంతుని ప్రాపు సంపాదింపుము, ఆపిమ్మట ధనము నార్జింపుము. ఈవరుసను తలక్రిందుచేయ జూడకుము. పారమార్థికత సంపాదించిన యనంతరము గృహస్థుడవైతివా నీమనశ్శాంతికి భంగమురాదు.

763. చిన్నపిల్లలు చావిడిగదిలో విచారము భయము ఆటంకము లేకుండ స్వేచ్ఛగా బొమ్మలు పెట్టుకొని ఆటలాడుదురు కాని తల్లి కనబడగానే తమ బొమ్మలనన్నిటిని విడిచివేసి "అమ్మ! అమ్మ!" అనుచు పర్విడుదురు. ఓనరుడా! నీవును ఈభూలోకమున ధనము, కీర్తి ప్రతిష్ఠమున్నగు బొమ్మలతో మిగులపరవశమునజిక్కి ఆటలాడుచున్నావు. నీ కేమియు భయముగాని, దిగులుగాని, విచారముగాని లేకున్నది. కానినీకు ఒక్కసారి ఆదివ్యమాతదర్శనమయ్యెనా, నీకీవిషయములందు మక్కువ నిలువదు. వీని నన్నిటిని తన్నివేసి నీవా ఆదివ్యజనని సన్నిధికి పర్విడుదువు సుమీ!

764. ఎఱిగియో ఎఱుగకనో ఎటులైనను మృతసరోవరమున పడెనేని, నరుడు అందుమునిగి అమృతుడగును. ఐచ్ఛికముగగాని, పరప్రేరణచేతగాని, ఎటులైననునేమి భగవన్నామస్మరణ చేయునెడల, తుదినిమనుజుడు అమరత్వమును పొందును.

765. సదా హరికీ రనము జరుగు నింటిని దయ్యము చొచ్చబోదు.