పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

18

58. దూరమునుండిచూచుచో సముద్రజలము వినీలమై కాన్పించును. కాని ఒక్కింతనీటిని చేతిలోనికితీసుకొని చూచితిమా, ఏరంగునులేక స్వచ్ఛముగనుండును. అటులనే దూరమునుండి చూచువారికి శ్రీకృష్ణభగవానుడు నల్లనివాడై చూపట్టును; కాని అతడట్టివాడుకాడు. అతడు నికులుడు, ఏవర్ణములేనివాడు, నిరామయుడు సుడీ!

59. భగవానుడిట్లనును:- కాటువేయుపామును నేనే; విషమును తొలగించు మాంత్రికుడను నేనే; శిక్షలవిధించు దండనాధికారిని నేనే; ఆదండనలనెఱపి బాధించుకింకరుడను నేనే;"

60. బ్రహ్మస్వరూపభావన యెట్లుండును? అది మాటలచే వివరింపశక్యముకానిది. ఎన్నడు సముద్రమునుచూచియుండనివానికి దానిని అభివర్ణించిచెప్పుమని ఎవనినైన అడిగినచో "అదా! విశాలమగునీటిప్రదేశము; నీటిమయమగు పెద్దతావు! అదెటుచూచినను నీరే! అనుచుమాత్రమే వచింపజాలును."

61. మానవులు నోటితో పల్మరుపఠించుటచేతను, వారినోటినుండి వెలువడుచుండుటచేతను, వేదములను, తంత్ర శాస్త్రములును, పురాణములును, ఇంక ప్రపంచములోని మతగ్రంధములన్నియు ఉచ్చిష్టములేయైపోయినవి. కాని బ్రహ్మముమాత్రము అటులయెంగిలిపడలేదు. ఏలన ఇంతవరకేనరుడును తనవాక్కుచేత వానినివర్ణింపజాలడయ్యె.