పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

251

37వ అధ్యాయము.

708. ఎఱిగిగాని, ఎఱుగకగాని స్ఫృహ యుండిగాని స్ఫృహలేకగాని, భగవన్నామస్మరణ చేసినయెడల అట్టి స్మరణ సత్ఫలము తప్పక లభించును. స్వబుద్ధిపూర్వకముగా ఏటికిపోయి దానిలో స్నానముచేసినవానికిని స్నానఫలము కల్గును; వేఱొకనిచేత నీటిలోనికి దింపబడినవానికిని స్నానలాభము కల్గును; మఱియు నిద్రలోనుండగా ఎవరైన మీద నీళ్లు పోసిననుకూడ స్నానము చేయుట లభించును!

709. పుడమిలో బద్ధజీవులు మరణసమయమందు సయితము సంసారవిషయములగూర్చియే మాట్లాడుదురు. తీర్థయాత్రలుచేసియుండుగాక, గంగాస్నానము కావించియుండుగాక, తావళములు చేబూని జపములు చేసియుండుగాక హృదయములో సంసారవ్యసనములు దాగియుండినచో ఫలములేదు; ప్రాణావసానకాలమునను అవి పై కుబుకుట నిజము. ఆసమయమున సంధిలో ప్రలాపములు సాగింతురు. చిలుక సామాన్యస్థితిలో "రాధాకృష్ణా" అని పవిత్రగానము చేయవచ్చును; కాని పిల్లినోట చిక్కినప్పుడు కిచకిచ మను స్వాభావికపు కూతయే వచ్చునుగదా!

710. దైవభక్తి లేకపోవుటవలన నరుడు చాలబాధ పడగలడు. కావున తన ప్రాణావసాన సమయమున భగవంతుడు తలపునకువచ్చునట్టి సాధనను చేయవలయును. అందుకుపాయము "దైవభక్తి సాధనమే!" ముందుగా అటువంటి సాధన చేసియున్నయెడల అవసానకాలము అది వానికి తలపునకువచ్చును.