పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37వ అధ్యాయము.

కర్మఫలము

706. జీవుడు గతజన్మను చాలించి ప్రపంచమునుండి వెడలుసమయమునచేయు సంకల్పాను సారమగు శరీరమును పొందును. కాబట్టి భక్తిసాధనలు చాల అవసరములు చిరకాలాభ్యాసమువలన సాంసారికచింతలు మనస్సునుండి జారిపోయి, దైవచింత మాత్రమే జీవుని అంటియుండును. అది మరణ సమయమునను విడువదు.

707. నేను ఒకచోట రెండు బుడ్డగొట్టినయెద్దులను చూచితిని. ఆవొకటి ఆత్రోవనుపోవుచుండగాంచి, ఒకయెద్దు ఉద్రేకమును పొందినది; రెండవది శాంతముగనున్నది. ఈచిత్రవర్తనమును కనుగొని ఈయెద్దులయొక్క పూర్వచరిత్రను విచారించితిని. మొదటిది పెద్దదై ఒక ఆవుతో మెలగిన పిమ్మట దానికి బుడ్డగొట్టిరట; రెండవదానికి చిన్న దూడగా నుండగనే కొట్టిరని తెలియవచ్చినది. పూర్వ సంస్కారబలము అంత గొప్పది. సంభోగ సుఖమును పొందకుండ సంసారమునుత్యజించిన సాధువులు స్త్రీలు కాన్పించినప్పుడు కామోద్రేకమును పొందరు. సంసార భోగముల ననుభవించి ముసలువారైన పిమ్మట కాషాయవస్త్రమును తాల్చువారు, చిరకాలము ఇంద్రియ సంయమనము చేసియు పూర్వ సంస్కారములకు లొంగుట కలదు.