పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

238

రింపచేసెనా, అంతట వారిని సదా ధర్మమార్గమున నడువం జేయుట దుర్లభమగును.

668. లేత వెదురువాసమును సులభముగా వంచనగును; ముదురు వెదురును గట్టిగబట్టి వంచబోతిమా అది విరుగును గాని వంగదు. బాలుర మతులును సులభముగ భగవంతుని దిశకు మరల్చవచ్చును; కాని శిక్షణ యెఱుంగని పెద్దవారల మతులు ఎటుత్రిప్పబోయినను పట్టు తప్పిబోవును.

669. వరిపొలములలో చేపలను పట్టుటకు పెట్టు వెదురు మావుల ద్వారములగుండా నిగనిగలాడుచు నీరు ప్రవహించుటనుచూచి చేపల సమూహములును ఆనందముతో అందు ప్రవేశించును. కాని అందొకసారి ప్రవేశించినవెనుక తప్పించుకొని బయటపడజాలవు. అటులనే బుద్ధిహీనులు సంసారపు వలలలో మాయసుఖముల కాశపడిజొరపడుదురు. మావులజొచ్చు చేపలవలెనే వీరును సంసారములందు జొరబడగలరే కాని దానిని త్యజించి విరాగులుకాలేరు సుడీ!

670. ధనమదాంధులు, దుర్గర్వులు, జ్ఞానపాషండులును ఆత్మజ్ఞానము పడయుటకు అనర్హులగువారిలో లెక్కింప బడుదురు. "ఒకానొకచోటున మంచిసన్యాసి యున్నాడు. చూచి వత్తమా?" అని ఎవరైన వీరితో ననినయెడల, వీరు తప్పకుండ సాకులనుపన్ని రాజాలమని చెప్పుదురు. కాని తమ మనస్సులలో మాత్రము "మనము పలుకుబడిగల పెద్ద మనుష్యులము! ఎవనినో చూచుటకు రమ్మనిన మనము పోతగదు." అని తలంతురు.