పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భగవంతుడు.

2వ అధ్యాయము.

47. భగవంతుడు నరులందఱియందున్నాడు. కాని నరులందఱును భగవంతునిలో లేరు. అందువలననే వారుదుఃఖముల పాలగుచున్నారు.

48. రాత్రికాలమున ఆకాశమునందు నక్షత్రములు అనేకములు నాకుకాన్పించుచున్నవి. సూర్యోదయమైనపిమ్మట అవికానవచ్చుటలేదు. ఆకారణము చేతనీవు పగటివేళ ఆకాశమున చుక్కలులేవనవచ్చునా! ఓనరుడా! నీవుఅజ్ఞానవశమున నున్నకాలమున నీకుభగవంతుడు కానరానికారణముచేత భగవంతుడు లేడనబోకుము.

49. చంద్రుడు ప్రతిబాలకునకును "మామ" అయినవిధమున భగవంతుడు సర్వమానవకోటికిని "గురువు" అగు చున్నాడు.

50. గంటవాయించుసమయమునవినవచ్చు గణగణధ్వనులు, ప్రత్యేక ప్రత్యేకరూపములుగలవానివలె వేర్వేఱైతోచవచ్చును; కాని వాయించుటనాపినప్పుడు ఆభిన్నధ్వని మాత్రమే కొంతసేపు వినవచ్చి క్రమక్రమముగా సమసిపోవును. ఈధ్వని నిరాకరమైయొప్పును. గంటయొక్క యీధ్వనులవలనే భగవంతుడు సాకారుడును, నిరాకారుడునె వెలయగలడు.