పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30వ అధ్యాయము.

ఆత్మజ్ఞానము - సంఘాచారములు

586. చెట్టునపండి తనంతటతాను రాలినపండు చాలమధురముగనుండును; కాని కోసిపండవేసినకాయ అంతతియ్యగా నుండదు. మఱియు వాడి ముడుతలుపడును. అదేతీరున సిద్ధత్వమునుపొంది సమస్తభూతములతోడను పరమైక్యభావమును బడసిన పురుషునినుండి కులాచారములు తమంతతామె రాలిపోవును. అట్టిపరమోత్కృష్ణానుభవముకలుగునంతకాలమును ఇతరులందు ఎచ్చుతగ్గులుపాటించుగుణము తొలగిపోదు. వారంతవఱకును కులభేదములను అనుసరించవలసినవారే అగుదురు. అజ్ఞానస్థితిలోనె కులభేదములను విడిచివేసి విచ్చలవిడిగ వర్తించుచు సిద్ధత్వమును పొందినటుల నటించెనేని కృత్రిమముగా పండవేసిన పచ్చిపిందెవలె చెడకతప్పదు.

587. తుపానుగాలి వీచుసమయమున రావిచెట్టుయేదో, మఱ్ఱిచెట్టుయేదో భేదముచేయుటకష్టము. అదేతీరున బ్రహ్మజ్ఞానానిలము వీచునప్పుడు కులభేదములు పాటింప వీలుండదు.

588. భగవద్భక్తిని పూర్తిగ గ్రోలినభక్తుడు నిజముగా సారాత్రాగినవాడే! అట్టిదశలో ఆతడు ఉచితానుచితములను గమనించలేడు.

589. ప్రశ్న:- బ్రహ్మజ్ఞానమును ప్రాపించిన యతడింకను జంద్యమునుంచుకొనుట మంచిదా?