పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

188

545. మనకు ఆహారమును ప్రసాదించును కావున భగవంతుడు కృపాళుడు అనజాలము; ప్రతితండ్రియు తన బిడ్డలకు తిండిపెట్టవలశిన వాడే అగుచున్నాడుకాని, మనము వక్రగతుల నడచు సమయములందు, ఆయన మనలను దుష్టప్రేరణలనుండికాపాడును. కావున నిజముగాకృపాళుడు అనదగును.

546. ఒకగదిలో అనేక శతాబ్దములనుండి యున్న చీకటి యైనను, దీపము వెలిగించినంతనే మటుమాయమగుచున్నది. అట్లే అనేక జన్మాంతరములనుండి పెరిగివచ్చిన పాపరాశియైనను భగవంతుని కటాక్షవీక్షణము ఒక్కటి ప్రసరించిన మాత్రాన ఎగిరిపోగలదు.

547. గృహస్థుడగు నొకభక్తుడు:- దేవా! మీరు భగవంతుని చూచితిరి అని వింటిమి. కావున మేమును భగవంతుని చూచునటుల చేయుము. ఆదేవదేవునితో మేము సఖ్యము చేసుకొనుట ఎట్లు?

పరమహంసులవారు:- సర్వమును ఈశ్వరేచ్ఛ ననుసరించి నడుచును. భగవద్దర్శనమగుటకు కర్మమిగుల నావశ్యకము. నీవు చెఱువుగట్టున కూర్చుండి, "చెఱువులో చాలచేపలున్నవి" అని ఊరక అరచుచుండినచో నీకేమైన దొఱకునా? చేపలను పట్టుటకు ఆవశ్యకములగు పరికరములను తెచ్చుకొనుము. గాలపుచువ్వ, దారము, ఎఱ తెచ్చి, నీళ్ళలో నూకలు చల్లుము. అంతట ఎంతలోతుననున్నచేపలో పైకివచ్చును. నీవప్పుడు వానిని చూచి పట్టుకొనవచ్చును.