పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

187

26వ అధ్యాయము.

ఉత్తమన్యాయస్థానమున అధికారపీఠమున గూర్చుండుటకు పూర్వము సంవత్సరములకొలదిగ కష్టపడి పనిచేయవలసిన వాడయ్యెను. అటులశ్రమకోర్చి పాటుపడనిష్టములేని న్యాయవాదులు నిరుద్యోగులై తమను గోరుకొను కక్షిదారులులేక ఊరకనుండవలసినదే. కానిహఠాత్తుగ దైవకృపచే అభ్యుదయము కలుగుటయు ఎన్నడోతటస్థించవచ్చును. కాళిదాసునకు అటుల లభించినది. కేవలము పామరదశనుండి సరస్వతీదేవి అనుగ్రహమువలన ఆకస్మికముగభారతకవివరులందఱిలో మేటియనిపించుకొను స్థితికివచ్చినాడు.

544. ప్రశ్న:- భక్తుడు ఎన్నడైన భగవంతునితోడి సంపూర్ణైక్యస్థితిని పొందగలడా? అగుచొఎటులు?

జవాబు:- యజమాని యొకడు, తనవృద్ధసేవకుని వినయసంపత్తికిని, సత్యశీలమునకును, ఉత్తమసేవకును మెచ్చి, వానిని తన అధికారపీఠముచెంతకు దీసికొనిపోయి బలాత్కారముగా వానిని అందు కూర్చుండబెట్టవచ్చును. సేవకుడు నమ్రతచేత వలదన్నను విడువడు. అదేతీరున ఈ విశ్వాధిపతియు తన ప్రియసేవకునియొక్క చిరకాల భక్తినిష్ఠకును, విమలత్యాగమునకును ప్రీతుడై, వానిని తన సంహాసనమున జేర్చి బలాత్కారముగా తన దివ్యవిభూతిని వానికి ప్రసాదించగలడు. అయినను ఈశ్వరసేవకుడు తన సేవక భావము త్యజించి యజమానుని విభూతిని పాల్గొన నిచ్చగింపక పోనగును.