పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

182

534. లోకవృత్తములు సత్వరజస్తమో గుణమయములై యుండునటులనే భక్తియందును గుణభేదములుగలవు. నమ్రత గలిగి సాత్వీకరూపమును, ఆడంబరముతో రాజసరూపమును, పశువృత్తితో తామసరూపమును తాల్చుభక్తిరూపములు గలవు. సాత్వికభక్తుడు రహస్యముగ ధ్యానములు సాగించును. అతడు తన పడకపైన దోమతెఱచాటున ధ్యానమును సాగించుటచేత, ప్రొద్దుట ఆలస్యముగ నిద్రలేచును. వానికి తిన్ననినిద్ర లేకుండుట, అందుకుకారణమని వానిమిత్రు లనుకొందురు. మఱియు కొంచెము అన్నము కూరయున్నవాని సంపాదనతో వాని దేహరక్షణ, వ్యాపారమును ముగియును. తిండిలోగాని బట్టలలోగాని భోగసూచన యుండదు; వాని యింటిలో అలంకారాది ఆడంబరవస్తు సముదాయముండదు. స్తోత్రపాఠముల నాశ్రయించి ప్రపంచములో ఉన్నతిని యతడు సాధించబోడు.

రాజసభక్తుడు దేహమునందు నామాలును, మెడనిండతులసిపూసలును, ఒక్కొకప్పడు బంగారులింగకాయలను ధరించును. దేవతార్చనవేళలందు పట్టుపీతాంబరముల గట్టుటలోను, తాళమేళములతో ఆడంబరముగపూజల సలుపుటలోను మిగుల పట్టుదల చూపును.

తామసభక్తునికి అగ్గివంటి విశ్వాసముండును. బందిపోటువాడు బలముచూపి ద్రోపుడులు చేయునటుల, ఇతడు భగవంతునిపైని పశుబలప్రయోగము చేయజూచును.