పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

174

(1) శాస్త్రనియతమైన భక్తియొక్కటి. నిర్ణీతవిధిగాపూజచేయవలయును. భగవన్నామము యిన్నితడవలు స్మరించవలయును. యిట్టి నీమములు కలవు. ఇదంతయు వైధికభక్తిచర్య. శాస్త్రప్రకారము ఏర్పడినది. దీనివలనసమాధి యందు అవ్యయబ్రహ్మము నెఱుంగు బ్రహ్మజ్ఞానము ప్రాప్తింపవచ్చును. జీవాత్మపరమాత్మయందు లీనమై తిరిగి విడి రాకపోవచ్చును. సామాన్యభక్తుల చర్యయిట్టిది.

(2) కాని భగవదవతారముల యొక్కయు, ఈశ్వరునికి ఆప్తులైనవారియొక్కయు విషయమువేఱు. భగవంతునిపై వారికిగలప్రేమశాస్త్రవిధులచే కలుగునదికాదు. అది అంతరంగమునుండి ఆవిర్భవించును! ఆత్మలోనుండి వెల్లివిరియును. (చైతన్యునిబోలు) భగవదవతారులును, వారిఅంతరంగ కోటిలోనివారలును, సమాధిదశయందు ప్రాప్తించు అఖండజ్ఞానమునుపడసినవారే; అటులయ్యును భగవంతునితల్లీ, తండ్రీ, అనిభక్తిసలుపుచు, తమ పరమోన్నతపదవినుండి దిగివత్తురు. మఱియు "నేతి, నేతి." ఇదిగాదు ఇదిగాదు అనుచు మెట్టుపిమ్మట మెట్టుగా విడిచివేసి శిఖరమునకు చేరుదురు. అచ్చటికి చేరి "తత్వమసి" అది యిదియే అందురు. కాని తాముఎక్కివచ్చిన మెట్లవరుసయు, తామప్పుడు చేరిన శిఖరమువలెనే ఒకేతీరు సున్నము, యిటుక, ఇటుకపొడి చేర్చి కూర్చబడినవే అని వెనువెంటనే గ్రహింతురు. కాబట్టి వారు ఒకప్పుడు శిఖరముపైని నిలుచుచు, మఱొకప్పుడు మెట్లపైని ప్రచారముచేయుచు, పైకిని క్రిందికిని ఎక్కుచు దిగుచు నుందురు.