పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

162

479. సమాధిని సాధించిన పిమ్మటను "దాసోహం" రూపమునగాని, "భాగవతోహం" రూపమునగాని తమ "అహం" కారమును కొందఱునిలుపుకొందురు. ఇతరులకు బోధచేయునిమిత్తము శ్రీశంకరాచార్యులవారు విద్యాహంకారమును నిలుపుకొనిరి.

480. "తల్లీ, నీదుకార్యములను నీవ చేసుకొనుచున్నావు; కాని నరుడు "నేను చేయుచున్నాను అని తలచును" అనుచు ఎవడేని సర్వమును చేయునది భగవంతుడేయను విశ్వాసమును పూనినయడల జీవన్ముక్తుడగును. (ఈ జీవముండగనే ముక్తుడగును.)

481. ఒకనికి తాను నాయకుడననియు, ఒక సంప్రదాయ నిర్మాతననియు, తలంపుకలదేని వాని "అహం"కారము అపక్వమైనది. అయినను బ్రహ్మానుభవమును పొందిన యనంతరము భగవంతుని ఆదేశము ననుసరించి, పరోపకారమునకై ఉపదేశములు చేయుటవలన హానిలేదు. పరిక్షుతునకు భాగవతమును బోధించునిమిత్తమై శుకమహామునికి అట్టి ఆదేశము కలిగినది.

482. గట్టిపాఱిన కలకండయందు, యితరములగు మధురపదార్ధములందలి దుర్గుణములు లేనితీరున "దాసుడను" "ఉపాసకుడను" అనుకొను జీవాత్మయందు ఆపక్వజీవులందు గల దోషములుండవు, మఱియు వాని బావము భగవంతునే చేర్చును. నిజమునకు యది భక్తియోగమే!