పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

160

475. ఎవడో తనను ముక్కలుముక్కలుగా నఱుకవచ్చు చున్నటుల ఒకనికి కలవచ్చును. దద్దఱిలిపోయి, ఆతడు మేల్కాంచును. తనగదితలుపులులోపల గడియవేసియేయున్నటులను, అందెవరును లేనటులను తెలిసికొనును. అయినను కూడ కొన్నినిమిషములవఱకును వానిగుండెకొట్టుకొనుచునే యుండును. అటులనే మనఅభిమానాహంకారములు మనసువీడి చనునప్పుడు తమమహిమను లేశమైన వెనుకవిడిచియేపోవును.

476, ప్రశ్న:- మీరుసమాధిస్థితిలో నుండునప్పుడు, లీలగానైనను "అహం" కారము మీయందు నిలుచునా?

జవాబు:- ఆహా! సామాన్యముగాకొంత "అహం"కారము నిలిచి యుండును. బంగారపుసుద్దమీదవేసి రుద్దిన చిన్న బంగారురేకు పూర్తిగా అరుగుకుండురీతి నుండును. బాహ్యస్మృతి యంతయు తొలగును; కాని బ్రహ్మానందమును అనుభవించుకొఱకు కొంత "అహం"కారమును భగవంతుడు నాలో నిలిపియుంచును.

ఒక్కొక్కప్పుడు మాత్రము, దానిని సయితము భగవంతుడు తొలగించివేయును. ఇది పరమోత్తమ సమాధి స్థితి. ఆస్థితి యిట్టిదని ఎవ్వరును పలుకజాలరు. అది జీవాత్మపరమాత్మగా సంపూర్ణముగా మారిపోవు అనిర్వచనీయావస్థ. ఉప్పుతోచేసిన బొమ్మ సముద్రమును కొలుచుటకై దానిలో ప్రవేశించును. అది నీటిని తాకినతోడనే కరిగిపోవును. ఆపిమ్మట సముద్రము ఎంతలోతుగలదో చెప్పుటకై మరలివచ్చుటకు ఎవరున్నారు?