పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

151

22వ అధ్యాయము.

దాసుని "అహం" భక్తుని "అహం", పశివాని "అహం" నీటిపైన పుల్లతోగీసినగీతను పోలియుండును. చాలా కాలము నిలువదు.

446. "నేను" అనుశబ్దమును గురించి ఎవడేని మననము చేసి దానిజాడ కనిపట్టవలయునని ప్రయత్నించినయెడల అది "అహం"కారమును సూచించు ఒకశబ్దముమాత్రమని తెలియవచ్చును. దానిని వదలించుకొనుట కడుదుర్లభము. దుష్టమగు అహంకారమా, నీవేవిధముగాను నన్నువదలకున్న నే నీశ్వరదాసుడను అను అహంకారరూపమునుధరింపుము. దీనినే పక్వమైన అహంకారమందురు.

447. నీకు గర్వమున్నయెడల, భగవత్కింకరుడననియో, ఈశ్వరతనయుడననియో భావనచేసి గర్వపడుము. మహనీయులందు శిశుస్వభావము కాన్పించును. వారు భగవంతుని యెదుట పసివారివలె నుందురు గాన వారికడ "అహం"కార ముండదు. వారి బలమంతయు భగవంతునిదే. అది భగవంతుని నుండియేవచ్చును. వారిదేమియు నుండదు.

448. సమస్తమును ఈశ్వరేచ్ఛననుసరించి జరుగుననియు తాను ఈశ్వరునిచేతిలోని ఉపకరణమాత్రమనియు, ఎవడేని దృఢవిశ్వాసమును పడసెనేని అట్టివాడీ జన్మమందేముక్తుడగును. "ఓ భగవంతుడా! నీపనులు నీవచేయుచున్నాడవు! ఇట్లుండ ఆహా! వీరలు "నేను చేయుచున్నాడను అని వాకొనుచున్నారే!"