పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141

21వ అధ్యాయము.

మహంసులవారు నిష్ఠురముగ వలదనిచెప్పుటతప్ప ఆకానుకను సంతసమున స్వీకరింపరైరి. "నాకుడబ్బుతో నేలాటి పనియు నుండరాదు. దానిని స్వీకరించితినా నామనసు యికదానిపైననే నిలిచియుండును" అనిరి.

అంతట ఆపెద్దమనుష్యుడు సొమ్మును శ్రీరామకృష్ణపరమహంసులవారి బందుగులలో నెవరిపేరటనో బ్యాంకులోవేసి శ్రీ వారికి వినియోగపడునటుల చేసెదననెను. "అటులను వలదు. ఆపని కపటకార్యము. యింతేగాక ఒకరి దగ్గఱ నాధనమున్నది అను భావము నామనస్సును పట్టుకొనగలదు." అని శ్రీ వారుచెప్పిరి.

అప్పుడును ఊరకొనక ఆమార్వాడీ "మనస్సు తైలము తీరున నున్నయెడల, అది కామినీ కాంచనములతో గూడిన సంసార సాగరముపైని తేలికగ పఱచుకొని పైపైని తేలుచుండగలదని" ఒకప్పుడు శ్రీపరమహంసులవారు చెప్పిన వాక్యమును జ్ఞప్తికితెచ్చి, తనదానమును అంగీకరించుడని మరి మరి ఒత్తిడిచేయసాగెను.

"ఆమాటనిజము. కాని ఆచమురే నీటిపైని చాలకాలము అటులతేలుచుండిన యెడల మురుగెత్తును సుమీ! అటులనే కామినీకాంచనయుత సాగరముపైని తేలియాడుచున్ననుకూడ, మనస్సునకు వానితోడి సహావాసము చాలకాలము కలిగినయెడల, అది భ్రష్టమై కంపుకొట్టగలదు." అని శ్రీవారు సమాధానము చెప్పిరి.