పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137

21వ అధ్యాయము.

నిరంతరము మెలకువతో నుందురుగదా. అటులనేగృహస్థులై వర్తించువారు, కామము లోభము తమను భంగపఱచకుండ మెలకువగలిగి మెలగవలెను.

401. అడుగున సూదిబెజ్జమంత చిల్లియున్నను కడవెడు నీరును క్రమముగా కారిపోవును. అటులనే సాధకునియందు ఏమాత్రపు లోలతయున్నను వాని సాధనలన్నియు సున్న యగును.

402. సన్నిపాతజ్వరముచే బాధపడుచు సంధించియున్న వానిచెంత మంచునీరును, మిఠాయీలను పెట్టియుంచినయెడల వానిని ఆరగించవలయునను ఉద్రేకమును ఆరోగి ఆపుకొన గలడా? అటులనే కామజ్వరముతో కొట్టుకొనుచు యింద్రియ సుఖములకై ఆరాటపడు నరునికి ఒకవైపున సుందరవనితల టక్కులును మరొకవైపున ధనాకర్షణలును సిద్ధమైనచో వానిని అతడు నిగ్రహించ జాలడు. అతడుభక్తిని పోనాడి పెడత్రోవల త్రొక్కుట నిక్కువము.

403. కామినియు, కాంచనమును, లోకమునంతటిని పాపమున ముంచెను సుమీ! స్త్రీజగజ్జనని ప్రతిరూపముగా చూడబడినయెడల ఆమెవలని ప్రమాదముండదు.

కామినీకాంచనములందనురాగము నరుని పీడించుచున్నంతకాలము భగవత్సాక్షాత్కారముకాజాలదు.

404. "నేనుచేయుహరిభక్తి బోధలన్నియు నరులమానసములందు పరివర్తనమును గల్పింపజాలకుండుటకు కారణమేమి?" అనిచైతన్యులవారిని నిత్యానందుడు అడిగినాడు.