పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17వ అధ్యాయము.

శ్రద్ధ.

347. ఒకనిని చంపవలయుననిన కత్తులు, కఠారులు కావలసియుండును. తనను తాను చంపుకొనుటకు సూదియే చాలును. అదేతీరున యితరులకు బోధించవలయుననిన చాల గ్రంధములు శాస్త్రములు చదువుటవసరమగును; స్వస్వరూప సాక్షాత్కారమును పడయుటకు ఒక్కమంత్రమునందు శ్రద్ధయున్నచాలును.

348. చక్కెఱను కణకణలాడు నిప్పుపైన కాచుము. దానిలో మకిలియున్నంతవఱకును ఆపాకమునుండి పొగయు, కళపెళధ్వనులును వచ్చును. కాని మకిలిమాలిన్యము తొలగించిన పిమ్మట పొగయుండదు. చప్పుడుయుండదు. స్వచ్ఛమగు పానకము పొంగులుపెట్టుచుండును. అది గడ్డగట్టినను లేక పానకముగా నున్ననుగూడ దేవతలకుగాని, మానవులకుగాని పరమానందదాయినిగ నుండును. శ్రద్ధగలవానినడతయు అటులనేయుండును.

349. హిందువులలో అనేకతెగలున్నవిగదా! ఏ తెగను యేధర్మమును మనము అనుసరించుట? - పార్వతియొకసారి "నాథా! నిత్యమై, సత్యమై, సర్వవ్యాప్తమై పఱగుఆనందమునకు మూలమెందున్నది?" అని మహాదేవుని ప్రశ్నించినది. "దానిమూలము శ్రద్ధ (చలింపనివిశ్వాసము) లోయున్నది"