పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

104

309. భగవద్భక్తుడుతానుప్రేమించిన సర్వమును దైవముకొఱకై విడిచివేయుటెందులకు?

శలభమునకు దీపము గోచరించినపిమ్మట చీకటిలోనికి మరలుటకు యిష్టముపుట్టదు. చీమ చక్కెరరాశిలోపడి చచ్చునుగాని, వెనుకకుతిరిగిపోదు. అటులనే భగవద్భక్తుడు, బ్రహ్మానందప్రాప్తికొఱకై తనప్రాణమునే అర్పించును; దేనిని లెక్క చేయడు.

310. నీవు ఆర్జించకోరు ఫలమునకై తగిన సాధనలను పూనుము. "పాలలో వెన్నయున్నది" అని గొంతుక బొంగురుపోవునటుల అఱచినను నీకు వెన్నచిక్కదు. నీకు వెన్న కావలయుచో, పాలను తోడుపెట్టి పెరుగుచేయుము; దానిని చిలుకుము; అప్పుడు నీకు వెన్నలభించును. అటులనే నీకు దైవము ప్రత్యక్షముకావలయునని కోరుదువేని భక్తిసాధనలను చేయుము. "దేవా, దేవా! ఓదేవా!" అనియూరక అఱచిన ఫలమేమున్నది?

311. ఆత్మపారిశుద్ధ్యమునకు తోడ్పడు సాధనాంగములు ఏవన:-

(1) సాధుసంగము :- అనగా పుణ్యాత్ముల సహవాసము.

(2) శ్రద్ధ:- ఆత్మకు సంబంధించిన విషయములందు విశ్వాసము, భక్తి.

(3) నిష్ఠ:- తన ఆదర్శమునుగురించి అనన్యమైన భక్తి.

(4) భావము:- భగవంతుని చింతనమందు మునిగిమౌనముగనుండుట.