పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

96

287. లోతగు నూతియొడ్డున యుండువాడు దానిలో పడిపోదునేమోయని కడుజాగరూకుడై యుండితీరును. సంసారముననుండువాడు దానిమోసములకు చిక్కిపోకుండ మెలకువతో నుండవలయును. మోసములప్రోవగు సంసారకూపమున ఒక్కసారి పడిపోయినవాడు, నిరపాయముగను నిష్కళంకముగను వెలువడుట యరదు.

288. చేపలుపట్టు మక్కువతో ఒకానొకగుంటలో మంచి చేపలు చాలగా యున్నవేమొ తెలియగోరువాడు, అందు యిదివఱకు చేపలుపట్టినవారికడకు చచ్చఱపోయి "ఈ గుంటలో పెద్దపెద్ద చేపలుదొఱుకుట నిజమేనా? వానిని పట్టుటకు యేలాటి యెఱవేయవలయును?" అని యాతురముతో విచారించును. వారివలన అవసరమగు విషయములను తెలిసికొని, గాలపుకోలను చేపట్టి గుంటకడకుపోయి, గాలమును లోనవేసి నెమ్మదిగ కూర్చుండి, ఓపికతోను నేర్పుతోను చేపలను రాబట్టచూచుచుండును. తుదకు లోతున నుండు పెద్దసొగసగుచేపనొకదానినిపట్టుకొనగల్గును. అటులనే మహ్మాత్ముల యొక్కయు, ఋషివరులయొక్కయు వాక్కులందు పూర్ణవిశ్వాసముంచి మనస్సను గాలపుకోలతోడను భక్తి యనుఎఱతోడనునేర్పుతో భగవంతునిపట్టుకొనిహృదయమున దాచిపెట్టుకోవలయును. అదనుకొఱకై తెంపులేని ఓర్పుతో కనుపెట్టుకొనియుండవలయును. అటుల చేసినచో ఆదివ్య మీనము చిక్కగలదు.