పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95

12వ అధ్యాయము.

283. నీభావములయెడ ద్రోహివికాకుము. నిష్కపటముగనుండుము. నీభావములకు అనుసరణముగ వర్తించుము. నీకు తప్పక జయము చేకూరును. నిష్కపట వినిర్మల హృదయముతో ప్రార్ధనల చేయుము; అప్పుడు నీప్రార్ధనలు ఫలించును.

284. అద్వైతజ్ఞానము పరమోన్నతమైనదే, కానిస్వామిని సేవకుడు సేవించునటులను, పూజ్యుని పూజకుడు పూజించునటులను; భగవంతునికి మొదట ఆరాధనలు చేయవలయును. ఇది మిగులసులభమార్గము. ఇందువలన పరమమగు అద్వైతజ్ఞానమునకు దారిదొఱకును.

285. మహాచక్రవర్తిని దర్శించగోరువాడు, ద్వారముకడ కావలికాచునట్టియు, గద్దెడాపున కనిపట్టియుండునట్టియు వారిని ముందుగ తృప్తిపఱచవలసియుండును. సర్వేశ్వరుని కృపాపీఠమును చేరదలచువాడు గాఢభక్తిని సాధనచేయవలయును; భక్తులసేవించవలయును. చాలకాలము సాధుస్నేహము చేయవలయును.

286. గంజాయాకుతినుట, తోటకూరతినుటవంటిది కాదు; చక్కెఱమెక్కుట, అప్పాలు తినుటవంటిదికాదు; మొదటివి ఆరోగ్యమునకు హానికరములు; రెండవవాటిని రోగులును తినవచ్చును. పరమమంత్రమౌ ప్రణవము, శబ్దమాత్రము కాదు; పరబ్రహ్మమును ప్రకటించు స్వరచిహ్నమగును. అటులనే భక్తి ప్రపత్తులగుకోరిక, లౌకిక, కామవాంఛతో పోల్చతగినదికాదు.