పుట:Shodashakumaara-charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

షోడశకుమారచరిత్రము


ఉ.

రత్నరథుండు దానసురరత్నము మాపురిరాజు తత్సుతన్
రత్నవతీసమాఖ్య హరిరత్ననిభాలకఁ బోలుకన్యకా
రత్నము లేదు లోకమున రాజతలీలల నెప్డునుండు నా
రత్నగృహంబునం దనుచు రాసుత యుండెడు మేడఁ జూపినన్.

45


వ.

నాఁటినిశాసమయంబున మదీయపాదుకామహానుభావంబునఁ దదీయసౌధంబునకుం జని రత్నకళికాలోకం బగు తదంతరంబున.

46


క.

తొంగలిఱెప్పల మెఱుఁగులు
తొంగలిగొనుమేను వదనతోయరుహంబున్
రంగారఁ దల్పమున స
య్యంగన నిద్రింపఁజూచి యాత్మగతమునన్.

47


క.

నాగతి మున్ను నెఱుంగదు
నేగతి మేల్కనుపువాఁడ నీసతి నిద్రా
రాగము లగుచూపుల నను
రాగము వొడమునొ యమర్షరాగ మొదవునో.

48


ఉ.

అగ్గల మైనమోహమున నల్లన నేనొకయింత డాసినన్
దిగ్గన మేలుకాంచి సుదతీమణి వింతదనంబులేక తా
నిగ్గులుమీఱు కన్నుగవ నెయ్యపుఁ జూపులు సందడింపఁగా
డగ్గఱునేని నాకు నిట డక్కు మనోభవరాజ్యసంపదల్.

49


క.

అనుచుండ సౌధపాలుఁడు
తన ప్రియ కొకకథను జెప్పి తద్వేళకు నా
కనుకూలంబై కడునిం
పెనయంగా నొక్కపద్య మిట్లని చదివెన్.

50