పుట:Shodashakumaara-charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

షోడశకుమారచరిత్రము


నిడువాలుఁగన్నుల నెఱయు క్రొమ్మించులు
        దొలుకారు మెఱుఁగుల చెలువు గెలువఁ
జెన్ను దొలంకెడు చిఱునవ్వు నెమ్మోము
        నిండుఁజందురునకు నెఱసు చూప
నునుమించు పచరించు ఘనకుచయుగళంబు
        కనకకుంభంబుల గారవింపఁ
బలుకనేర్చిన కనకంపుఁ బ్రతిమవోలె
రామయై యొప్పు శృంగారరసమనంగ
నఖిలమోహనమూర్తియై యతిశయిల్లు
నన్నలినగంధిఁ బొడగంటిఁ గన్ను లలర.

124


క.

ననుఁ గనుఁగొని యయ్యంగన
యనురాగముఁ గౌతుకంబు నలవడ సంభా
వనము లొనరించి మదిలో
ననురాగము బెరయ నిట్టు లనియె న్నాతోన్.

125


సీ.

వీరచూడుఁ డనెడువిద్యాధరుఁడు గాంచె
        వనితల నలువుర వారిలోన
నగ్రజఁ జంధ్రప్రభాఖ్యమైఁ దనరుదు
        నాతోడఁ బుట్టిననలినముఖులు
పద్మరేఖయు శశిప్రభయును సుప్రభ
        యును ననువారల ముని శపింప
భూమిపై జనియించి పుట్టెఱింగినవారు
        వారలఁ బాసినవగపుచేత
వనమునకు నేగెఁ దపసి యై జనకుఁ డిప్పు
డేను జెలియండ్రరాకకు నెదురుచూచు