పుట:ShivaTandavam.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్యమము[1] రాగసామ్రాజ్యాధిదైవతము
శుద్ధమ్ముగాఁ[2] బ్రతిగఁ జూపించి వణకించి
వణకులో నొకగ్రొత్త వాలకము గనుబరచి
తని పూవులను బుట్టలను దెచ్చిపోసినటు
గలగలమనంగఁ జిఱుగవ్వలను వెదికినటు
బలపలని యెండుటాకుల మర్మరములట్లు
నాదధేనువు బొదుగునందు దుగ్ధము జాఱ
భేదవాదము రాగవీథిలో బుడమార

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

స్వరకన్యకల గుబ్బచనులఁ బుల్కలు రేపి
సురకాంతలకుఁ గోర్కె లెరయ నెమ్మదులూపి
లయపురుషు[3] నానందరాశిలో మునిగించి
రయముతోఁ దాళముల రవణములు హత్తించి
ఝల్లరీముఖవాద్య చయము మేనులుదాల్చి
యుల్లములఁ బొంగెత్తి "యో" యంచు నెలుగివ్వఁ
దంబూర యానంద తరళసంఫుల్ల వ
క్త్రంబుతోఁ, దానుగా గళమువిచ్చుక పాడ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

  1. సామాన్యముగ నన్ని రాగములు మారుటకును, మధ్యమ స్వరమే మూలము. అందుచే నది యధిధైవతమైనది.
  2. శుద్ధము గా శుద్ధమధ్యమము. బ్రతిగ ప్రతిమధ్యమము.
  3. తాళము లోని సామ్యము.