Jump to content

పుట:ShivaTandavam.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమశీర్షకముతోడ[1] సమదృష్టి[2] ఘటియించి
సమపాద[3] విన్యాస చాతుర్యము లగించి
వరపతాకమ్ము[4] దాపటి కేల నెసకొల్పి
వామహస్తం బధో వక్త్రముగ సంధించి
త్రిపతాకమూని[5] యర్థపతాకమును[6] బట్టి
చపలదృష్టులు దిశాంచలములను మోపట్టి
ధూతమస్తము[7] జెల్వు దోబూచు లాడంగ
వీతరాగులు ఋషులు వినుతులను సేయంగ
నిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజములై గానుపించిన యట్లు

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

హంసాస్యమును[8] రెండు హస్తంబులను నించి
అంసభాగంబులకు నానించి చూపించి

  1. క్రిందికిగాని, పైకిగాని, పంపక, యెత్తక, సమానముగా నుంచిన శిరస్సు.
  2. రెప్పపాటు లేని దృష్టి.
  3. సాధారణముగా నిలువబడినట్లుండును.
  4. అన్ని వ్రేళ్ళను చాచి, బొటన వ్రేలిని, చూపుడు వ్రేలి కడపటి గెణుపున కానించి చూపుట.
  5. పతాకహస్తమున అనామికను వంచి చూపుట.
  6. పతాకమున జిటికెనవ్రేలిని వంచి చూపుట.
  7. ఎడమ కుడిప్రక్కలకు గదలించెడు శిరస్సు
  8. నడిమివ్రేలు మొదలు మూడు వ్రేళ్ళను ఎడముగలవిగాజూచి యంగుష్టమును జూపుడువ్రేలితో జేర్చికట్టిన హంసాస్యము.