పుట:Shathaka-Kavula-Charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

ఇతఁడు బసవన్న స్థాపించి, పండితారాధ్యులు సంస్కరించిన వీరశైవమతమున కుద్ధారకుఁడు, ప్రచారకుఁడు నగుమహాకవియని చెప్పవచ్చును. శైవమతవ్యాప్తి కాదిని శైవులు జైనులఁ జూచి దేశభాషలలో నెక్కుడు వాఙ్మ యమును సులభకావ్యములుగ రచియించినారు. మతవ్యాప్తి కీతనిసులభవాఙ్మయ మాంధ్రకర్ణాటక దేశములయం దొనర్చిన కార్య మద్భుతమైనది. సులభవాఙ్మయముచే బ్రజాహృదయము నెట్లుమార్ప నగునో చూపుట కీతనిచరిత్రమునే చూపవచ్చును.

ఇతఁడు కర్ణాటాంధ్రభాషలయందును, సంస్కృతమునందును గూడ ననేకగ్రంథములను రచియించియున్నాఁడు. ఇత డష్టభాషాకవి యని బిరుదముకలవాఁడు. కవులచరిత్రము నూతనముద్రణమునం దీతనిగ్రంథముల పట్టికనుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.

"పాలుకురికి సోమనార్యుఁడు బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, అనుభవసారము, చతుర్వేద సారసూక్తులు , సోమనాథభాష్యము, రుద్రభాష్యము, బసవరగడ, గంగోత్పత్తిరగడ, సద్గురురగడ, చెన్నమల్లు సీసములు, నమస్కారగద్యము, వృషాధిపశతకము, మొదలయినగ్రంథములు రచియించినట్లు బసవపురాణ కావ్యమునం దీక్రిందిపద్యమునఁ జెప్పఁబడినది.

సీ! బసవపురాణంబు ♦ ఫండితారాధ్యుల
                చరితంబు ననుభవ ♦ సారమును చ
    తుర్వేదసారసూ ♦ క్తులు సోమనాథభా
               ప్యంబు శ్రీరుద్రభా ♦ ష్యంబు బసవ
    రగడ గంగోత్పత్తి ♦ రగడ శ్రీబసవాఢ్య
               రగడయు సద్గురు ♦ రగడడ చెన్న
     మల్లుసీసములు న ♦ మస్కారగద్య వృ
              షాధిపశతకంబు ♦ నక్షరాంక

గీ. గద్య పద్యము ల్పంచప్ర ♦ కారగద్య
    యష్టకము, పంచకము నుదా ♦ హరణయుగ్మ
    మాదియగు కృతు ల్భ క్తిహి ♦ తార్థబుద్ధిఁ
    జెప్పె నవి భక్తసభలలో ♦ జెల్లుచుండు !!

17