పుట:Shathaka-Kavula-Charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శతకకవులచరిత్రము


కాలమునకే పండితుఁడు మరణించియుండునని శ్రీ లక్ష్మణరావుగా రూహించుచున్నారు. ఈ యూహలకుఁ గారణము పండితారాధ్య చరిత్రమునందలి వ్రాతలే ! పండితారాధ్యునిమహిమలు, అతిమానుషము లగుకథలు, నెన్నియో చరిత్రమున వ్రాసియున్నారు. వాని సత్యాసత్యములు చర్చించుట కిది తావుకాదు. కాని శైవులలోఁ బండితునిసమకాలికులే యాతని యవతారపురుషునిఁగా భావించి పూజించిరని • పెక్కునిదర్శనములఁ జూపవచ్చును.

చందవోలుకైఫీయతులో (లోకలురికార్డ్సు సంపుటము 10-133 ) మల్లికార్జునపండితులు "వానస” వంశోద్భవులని యున్నది. మన కీవఱకు నన్నయమిత్రుఁ డగునారాయణభట్టు వానసవంశోద్భవుఁడని భారత కృత్యాది నున్న "పాయక పాశశాసనికి భారతఘోరరణంబునందు నారాయణునట్లు [1] వానసధరామరవంశ విభూషణు" డనువాక్యములవలనఁ దెలియును. మడికి సింగన తనవాసిష్ఠరామాయణములోఁ గందనమంత్రి "వాణసవంశాబ్దిసుధాకరుండును, గాశ్యపగోత్రపవిత్ర అబ్బనార్యతనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహబాంధవుండు” నని వ్రాసియుండెను. ఈముగ్గురును వానసవంశోద్భవులే! ఈవంశవివరములఁ జారిత్రకపరిశోధకులు చర్చించెదరుగాక! గోత్రభేద ముంట నీమువ్వురు బందుగు లనవీలు కలుగుటలేదు. కర్ణాటకకవిచరిత్రము పండితయ్య వాణసవంశమువాఁ డనియే చెప్పుచున్నది.

ప్రస్తుత మాంధ్రదేశమునందు "ఆరాధ్యబ్రాహ్మణుల" మని చెప్పుకొనులింగధారు లీపండితుని సంప్రదాయమువార మని చెప్పుకొందురు. కాని పండితునిగ్రంథమునందు దొరకినభాగములో లింగధారణమునుగూర్చి యేమియుఁ జెప్పలేదు. ఇతఁడు శివభక్తినేప్రతిపాదించిన " ద్వైతి"యని శ్రీలక్ష్మణరావుగారు నిర్ధారణ మొనరించియున్నారు.

  1. ఈపాఠ మిట్లుభారతమువారి (మల్లేశ్వరపుఁబండితులు) ప్రతిలో నున్నట్లు నేను కనుగొని 5, 6 సం||రముల క్రితము ప్రకటించితిని.