పుట:Shathaka-Kavula-Charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శ్రీ యుత వంగూరుసుబ్బారావుగా రాంధ్ర వాఙ్మయమునకు జేసిన సేవకు గృతజ్ఞతను దెలుపుట కీగ్రంథ పీఠికను వ్రాయబూనితిని. గతసంవత్సరమునం దాంధ్రవాఙ్మయ సేవాపరాయణులైన శ్రీయుతులు కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు, లచ్చారావుగారు, సుబ్బారావుగారు పరమపదించుట యాంధ్రలోకమునకు గలిగిన దురదృష్టము. సుబ్బారావుగారు ముష్పదియేడవయేటనే పరమపదము చెందిరి. ఈ స్వల్పకాలమునందే సుబ్బారావుగారు “ప్రభాతము, వేమన, ఆంధ్ర క్షత్రియులు, వసంతలేఖలు, ఆంధ్ర వాఙ్మయచరిత్రము, శతకకవులచరిత్రము” మొదలగుగ్రంథములను వ్రాసి యాంధ్రభాషకు విశేషమైన సేవనుజేసి యాంధ్రవాఙ్మయమునందు స్థిర ప్రతిష్ఠను బడసిరి. సుబ్బారావుగారి మిత్రులకును ఆంధ్రభాషాభిమానులకును వారి యకాలమరణము విచారమును గలుగజేసినది, ఆంధ్రభాష నిజసేవాపరాయణులు లేకను తనప్రతిభను గోల్పోవుచున్నసమయమునందు సేవాపరాయణుల నిర్యాణము భాషాభిమానులకు విచారకారణం బగుచున్నది. సుబ్బారావుగారి గుణములందు మాతృభాషాభిమానమును ఆత్మగౌరవాభిమానమును గణనీయములు. ఆంధ్రనామ స్మరణము సుబ్బారాపుగారి కావేశమును గలుగజేయుచుండెడిది. ఏప్రాంతములకు బోయినను సుబ్బారావుగా రాంధ్రులప్రతిష్ఠను సమర్థించుట కధికోత్సాహమును గనుపరచుచుండిరి. పుసహా, కలకత్తానగరములందు జరిగిన పరిశోధక మహా సభలయం దాంధ్రులవ్యక్తిత్వమును బ్రతిపాదించుటకు జేసిన ప్రయత్నములు వారియాంధ్ర త్వాభిమానమును విశద