పుట:Shathaka-Kavula-Charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxiv)


న్నట్లు నాకుఁ గనఁబడుచున్నది. అది బాల్యకృత మని యెట్లనఁ గలుగుదును?

శతకము లన్నియుఁ గవులు బాల్యమునందు వ్రాసిన వగుట నాదరణపాత్రములు కావని మెఱికలవంటి ప్రౌఢశతకములఁగూడ విడుచుట న్యాయముగాఁ గనఁబడదు. అందువలనఁ జేతనైనంతవఱకు మన శతకములపరశీలన మొనరించి యందుండిగుణములఁ గొంచెముచవి చూపింపఁబ్రయత్నించెదను. నేనుమంచివేయనుకొనినశతకము లన్నియుఁ జూపలేను సరికదా, ప్రసిద్ధశతకము లన్నిఁటినిగూర్చియైనఁ జెప్పుట సులభముకాదు. కావున స్థాలీపులాకన్యాయమునఁ గొంచెముభాగమే పరిశీలించుకొందముగాక!


శతక పరిశీలనము.

ఆంధ్రభాషలో రమారమి 600 శతకములు కనఁబడినవి. (1) ఇందు భక్తిశతకము లధికము. శైవము, వైష్ణవము, కూడ నున్నవి. రామశతకములు, ఆంజనేయశతకములును వైష్ణవములని యంగీకరించినచో శైవము వానికంటె వైష్ణవ శతకము లధికముగఁ గనఁబడుచున్నవి. (2) వేదాంతశతకములు కొన్నియున్నవి. ఇవి వేమన, ఆత్మలింగ, అప్పాలయోగి మొదలగువారిశతకములు, బైరాగులు చదువుచుందురు. వేదాంతబోధకులు తెలుఁగులో నిర్వచించునట్టియద్వైతమతబోధకములుగా నుండుపద్యములుండును. తత్త్వములలోఁ బ్రతిపాదింపఁబడు నట్టివిషయములె యీశతకముల నుండును. శృంగారము భక్తిలో నొకభాగ మనినచో మనశతక వాఙ్మయములో మూఁడువంతులు భక్తిశృంగారములపా లగును. శృంగార శతకములు వేఱుచేసినయెడల నివి రమారమి యిరువదిశతకముల కొకటిచొప్పున రావచ్చును. చాలవఱకు శృంగారశతకములు కృష్ణునిపై సుండుటచే నవి భక్తిప్రతిపాదకము లనవీ లున్నది. కేవలశృం