పుట:Shathaka-Kavula-Charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxi)


ము సుబోధ మయినచోఁ బామరు లైనను రసమును గ్రహింపఁగలరు. కనుక దానినాదరింపక మానరు. కావ్యగుణము సులభలభ్యముగ నున్న చో, వారది యూదరించి తీరెదరు. వ్యాప్తినిఁబట్టి గ్రంథగుణము సర్వదా నిర్ణయముకాదు. కాని శతకకవిత్వమునందు కావ్యగుణము సులభముగ లభ్యమగు నని నాయాశయము.

లక్షణవిరుద్ధముగ వ్రాసి రని నింద లొందుచున్నపోతన్న భాగవతము, కృష్ణరాయని యాముక్తమాల్యద, వేంకటకవి విజయవిలాసమును నైఘంటికు లంగీకరించిరి. పచ్చిబూతులు వ్రాసె ననుచున్న ముదుపళనిరాధికాస్వాంతనము, కుచకచాదుల వర్ణించిన సారంగుతమ్మయ్య వైజయంతీవిలాసము, బిల్హణీయమును బనికివచ్చినవి. ఈ గ్రంథములపేరుల వినిన నేవగించు కొందు మని వ్రాయనేర్చిన శ్రీ వీరేశలింగము పంతులుగారికి భక్తి, వైరాగ్యములు, నీతి, మతము, శరంపరలుగఁ బామరులకు బోధచేయుట కుపయోగించిన శతకరాజము లుప్పుగల్లునకైనఁ బనికిరాకపోవుట శోచనీయము. దుష్టగ్రంథములని వారు చెప్పినవానికర్త లగువేశ్యలు, వేశ్యాపుత్రులచరిత్రములు బాగుగఁ బరిశీలించి వ్రాసిరికాని యాంధ్రదేశ మంతట ననునిమిషము పండితపామరుల నొడలుపులకరింపఁజేయు "దాశరథీ కరుణాపయోనిధీ” యనువాక్యము వ్రాసిసకర్తచరిత్రమును వారు వెదకుటకుఁ బ్రయత్నింపరైరి.

శివభక్తులు, విష్ణుభక్తులు, వేదాంతశిఖామణులును వ్రాసిన తేటతెలుఁగు కావ్యరాజము లనఁదగిన శతకకవులచరిత్ర మీవఱకే వ్రాయక, భక్తిజ్ఞాన వైరాగ్యమూర్తు లగువారిపేళ్లే దలఁపెట్టక, వారిపై గ్రీఁగంటిచూపు లైనఁ బంపక మనచరిత్రకారు లాలసించియున్నా రను దుఃఖముచేఁ బెద్దల నిట్లు పైవాక్యములలో నడిగినందులకు మహాజనులు మన్నించెదరుగాక! -

పర్యవసానమున నామనవి యేమనఁగా మనపూర్వు లగుకొందఱు లాక్షణికులు, చరిత్రకారులవలె మన మీవాఙ్మయ ముపేక్షించి