పుట:Shathaka-Kavula-Charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


సాహసమునకు బూనుకొనలేదు. సుబ్బారావుగారిప్రోద్బలముననే నేను శతకములను బ్రత్యేకముగ కవులచరిత్రములుగల పీఠికలతో ప్రచురించుటకు బూనుకొంటిని. వృషాధిప సర్వేశ్వర నారాయణ రఘువీర కాళహస్తీశ్వర దాశరథీశతకములు మొదలగు పదిశతకములను బీఠికలతో బ్రచురించితిని. సుబ్బారావుగారు జీవించియున్నపుడు నేను బీఠికను వ్రాయుటకు నిరాకరించియును వారి మరణానంతరము గ్రంథపరిచయమునకు బీఠికనువాయుట యవసరంబై పూనుకొనినందులకు బండితులు మన్నింతురుగాక!

సుబ్బారావుగారిప్రయత్నఫలమును, నాకృతజ్ఞతను వెల్లడిచేయుట కీపీఠికను వ్రాయుటకు బూనితిని. సుబ్బారావుగారు గ్రంథమునకు 44 పుటల ప్రవేశవ్యాసమునువ్రాసి శతకవాఙ్మయ చరిత్రము నాంధ్రలోకమునకు బరిచయముచేసిరి. గ్రంథము 540 పుటలనుగలిగి భావగర్భితముగ నున్నది.

ఆంధ్రవాఙ్మయమునందు బురాణములు కావ్యములు ప్రబంధములు శతకములు నవలలు నాటకములు మొదలగు వ్యక్తిత్వముగల విభాగములు గలవు. ఆవిభాగము లన్నియును బ్రత్యేకచరిత్రము నపేక్షించుచున్నవి. ఆ విభాగములందు శతకవాఙ్మయ మొకఘట్టముగ నున్నది. ఆంధ్రశతకములు ప్రాకృతసంస్కృత గ్రంథములపరిణామములైనను ప్రత్యేకవ్య క్తిత్వమును గలిగి యాంధ్రలోకాదరణమును బడసినవి. శతకవాఙ్మయము పండితపామరులకు బ్రియతరమైనను, లాక్షణికుల యాదరణమునకు విశేషముగ బాత్రము గాలేదు. లక్షణగ్రంథములను వ్రాసిన యప్పకవియనంతామాత్యాదులును గవులచరిత్రను వ్రాసిన వీరేశలింగము పంతులుగారును శతకవాఙ్మయము నాదరించియుండలేదు. ఆలోపమును దీర్పుటకు సుబ్బారావుగా రీగ్రంథమును రచించినటులు వారిపీఠిక విశదము చేయుచున్నది.