పుట:Shathaka-Kavula-Charitramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

శతకకవులచరిత్రము


లేనంతవఱకు శ్రీ. మా. రా. కవిగారిపద్యము ననుసరించి బద్దెనయే దీనికర్త యని తలంచుచుందుముగాక !

శ్రీతమ్మయ్యగారే వ్రాసిన యీక్రిందిసంగతులవలనఁ బాలుకురికి సోమనాథునిగ్రంథమునందు సుమతిశతకచ్ఛాయలు కనఁబడుచున్నవి. సత్యమేకాని యవి యెవరినుండి యెవ్వరు గ్రహించిరో చెప్పఁజాలము. సోమనాథునిగ్రంథములలో శివతత్త్వసారము కుమారసంభవము మున్నగుగ్రంథ భాగములు పెక్కు లుదాహృతములైయున్నవి. కావున శతకకర్తనే సోమనాథుఁ డనుకరించె నని యేల యనరాదు?

"ఈబద్దె భూపాలుఁడు క్రీ. శ. 1251 ప్రాంతమువాఁడని కొన్ని శాసనములవలనఁ జరిత్రజ్ఞులు తేల్చియున్నారు. ఇందులకు మఱియొక దృష్టాంతముగూడఁ గలదు. ఈ కవిగూడఁ దనకించుమించుగ సమకాలికు లయిననన్నెచోడ తిక్కనాదికవులవలెనే జాతీయకవితా నిర్మాణశేఖరుఁ డగుపాలికురికి సోమనాథునిగ్రంథములను జదివి యాతని ననుకరించినాఁడు, మచ్చున కీక్రింది దృష్టాంతమును జూడుఁడు.

ద్వి. నల్లవో భామల యుల్లం బెఱుఁగక| గొల్లవాఁడైనను గోరునే కవయ
     నొల్లని వెలయాలి నొల్లనినృపతి| నొల్లని చెలిఁబాయ నొల్లఁడేనియును
     గొల్లండు వాఁడెగా కెల్లడజాతి| గొల్లఁడు గొల్లండె గొల్లడేనియును!!
     (పాల్కురికి సోముని పండితారాధ్య చరిత్రము ప్రకరణము 2)

క. ఒల్లనిసతి నొల్లనిపతి | నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
   గొల్లండు గాక ధరలో| గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ.

పాలకురికి సోమనాథుఁడు క్రీ. శ. 1192 ప్రాంతమువాఁడు. బద్దెభూపాలుఁ. డాతని తరువాత రమారమి డెబ్బది సంవత్సరములకు వెలిసినవాఁడు, కావున సుమతిశతక మిప్పటి కాఱువందల యేఁబది యేండ్లకుఁ బూర్వము రచింపఁబడి అప్పటినుండి ప్రచారములో నున్నట్టు లెంచవచ్చును. ” బం. త. ఆంధ్రపత్రిక. సారస్వతానుబంధము.

బద్దెనకాల మిదివఱకు నిశ్చితము కాలేదు. ఆసంగతి పైన వివరించియున్నాను. సోమన్న పెద్దగ్రంథములు వ్రాయవలసినవాఁడు. చిన్నశతకముకొఱకు సుమతిశతకకర్త యీయనుకరణ మొనరించి యుండె నని సిద్ధాంతీకరించుట పునాదిలేనిగోడపై బొమ్మవేయటవం