పుట:Shathaka-Kavula-Charitramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రసానుభవము కావ్యమునకు బ్రయోజనము. నవరసములందును శృంగారకరుణరసములు ప్రధానములు. శృంగారకరుణరసములు కామపరము లైనపుడు బంధనమునకును, దైవపరములైనపుడు మోక్షమునకును మూలము లగుచున్నవి. శృంగారకరుణామూర్తియైన భగవంతుని శృంగారకరుణా లీలావిలాసము లనంతములు. అనంతమైన శృంగారకరుణావిలాసముల యానందానుభవమున కనన్యమైనభక్తి సాధనముగ నున్నది. అనన్యమైన భక్తిపారవశ్యానందమును వర్ణించుటకు శతకములు యోగ్యముగ నున్నవి. కవు లిష్టదేవతాప్రార్థనమును బలువిధములను చేసి తరించుటకు శతకము లుత్కృష్టసాధనములు. సర్వేశ్వర శతకము, కూర్మశతకము, నారాయణశతకము, రామతారకశతకము, దాశరథిశతకము, కాళహస్తీశ్వరశతకము మొదలగు శతకములందల ఈశ్వరస్తవములు భక్తి రసానందమును గలుగ జేయుచు ముక్తిమార్గమును గఱపుచున్నవి. కవులు తమతమగ్రామములందు వెలసిన పరమేశ్వరావతారములను శతకరూపమున బ్రార్థనచేయుచు గవిత్వమును సార్ధకము చేయుచున్నారు. భక్తహృదయావేశమును దెలిపెడిశతకము లనేకము లాంధ్రభాషయందు గలవు. శతకముల పరిశీలన మాంధ్రహృదయ వికాసమును భాషావికాసమును విశదము చేయగలవిధమును సుబ్బారావుగారు గ్రంధమునందు విశదముచేసిరి. గ్రంధము శతకవాఙ్మయము వృద్ధి నొందినవిధమును జక్కగ వివరించినది. శతకములందు భక్తిశతకములే కాకను నీతిహాస్య శృంగారశతకములునుగలవు. పండ్రెండవశతాబ్దియందు భక్తిభావముతో నారంభమైన శతకవాఙ్మయము పదునేడవశతాబ్దియందు శృంగారరూపమును దాల్చినది. శతకకవులచరిత్రము మతసిద్ధాంతము లందును సాంప్రదాయములందును సాంఘికవ్యవస్థలందును గలిగిన మార్పులను విశదముచేయుచు నాంధ్రహృదయ పరిణామమును నిరూపించుచున్నది.