పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


కలరేమో మును పొణినీయ ముఖవర్గమ్మింత నీజోడుగా
కలరేమో మును తిక్కనాదులు సమగ్రమ్మైన యుజ్జీలుగా
కలరేమో కవిరాజు లన్యనృప సత్కారమ్ముతో నీడుగా
కలలోవార్త భవత్సదృక్షులకు నీ గారం బపారంబురా!

    ప్రాఁతవడ్డ పురాణపథము వీడక మోఁత
                బరువుగాగ్రంథముల్ వ్రాయునాఁడు
    అల్లిబిల్లిగఁ గథ లల్లియుం బాడువా
                రిని సమర్థించి వర్థిల్లునాఁడు
    కులమత భేదవాదులకు దోహదమిచ్చు
                మతకావ్యములు మారుమసలునాఁడు
    కోర్కితీర్పనిదానిఁగూర్చి యఱ్ఱులుసాఁచి
                పచ్చిశృంగారంబు పలుకునాఁడు

    యతుల దిగనాడి ప్రాసల నతకరించి
    వెఱ్ఱి మొఱ్ఱి కవిత్వమ్ము వెలయునాఁడు
    జననమందవు పరమపావనుఁడ వీవు
    చిన్నయా ! నీ యదృష్టమ్ము చెప్పఁదరమె.

    జీవితరేఖకు నూతన
    జీవనముంగూర్చి బ్రతుకుఁజెల్లించిన వి
    ద్యావేత్తవు చిన్నయ్యా!
    రావయ్యా ! భక్తితోఁగరమ్ములు మోడ్తున్ ,

                                            - 'దివ్యస్మృతుల నుండి