గెలీలియోకు ఇలా చెయ్యాలని ఎందుకనిపించింది? అతడికో లక్షణం ఉంది. ప్రతిదాన్ని తనకు తాను తరచి చూసే లక్షణం అది. అందువల్ల అలా చేశాడు.
అంటే సైన్సు తనకు తాను సరిచూచుకునే, సరిదిద్దుకొనే లక్షణం ఒక స్వభావంగా కలిగి ఉంటుందన్నమాట. ఒకవేళ గెలీలియో ప్రయోగాన్ని మరెవరైనా మళ్లీ మళ్లీ సరికొత్త వాస్తవాల వెలుగులో చేశారనుకోండి అప్పుడు ఫలితం అదే రూపంలో రాలేదనుకోండి. గెలీలియో చెప్పింది పాక్షిక సత్యం మాత్రమే అని తేలిందనుకోండి. అలా తేలవచ్చు. తేలకపోనూవచ్చు. కానీ అలా నిరూపించే అవకాశాన్ని అట్టిపెట్టుకోడం సైన్సు ప్రత్యేకత. ఇదీ సైన్సు స్వభావం.
ఇంకోమాట. శతాబ్దాల తరబడి గెలీలియో ప్రయోగ ఫలితాన్ని మనమందరం అంగీకరించాం. అయినా ఆ పలితం వాస్తవమైనదేనా? అలా అని చెప్పలేం. వాక్యూమ్ కనుగొన్నాక మాత్రమే అందులో ప్రయోగించి చూచాక మాత్రమే ధీమాగా నిర్ధారణ చెయ్యగల్గుతున్నాం.
ఇలా చూస్తే గెలీలియో రెండంశాలు చెప్పాడన్నమాట. అరిస్టాటిల్ చెప్పింది తప్పని చెప్పడం మొదటిది. ఒకవేళ అరిస్టాటిల్ కూడా పూనుకొని ఇలాంటి పరిశీలనా, ప్రయోగమూ, కొలవడమూ చేసి ఉంటే ఆయన క్కూడా తన నిర్ధారణ సరైంది కాదని తెలిసి ఉండేది. ఈ అవకాశం ఆయనక్కూడా సైన్సు ఇచ్చిందని తన ప్రయోగం ద్వారా గెలీలియో చెప్పాడన్నమాట.
ఏతావాతా తేలిందేమిటి? సైన్సులో మన తప్పు మనం తెలుసుకొనే అవకాశం ఉంది. మన తప్పుని ఇతరులు వెతికి తప్పని చెప్పే అవకాశమూ ఉంది. ఈ ఇతరుల్లో ప్రకృతి కూడా చేరవచ్చు. 'నువ్వు చెప్పింది తప్పు' అని ప్రకృతి మనకు చెప్పొచ్చు.
సైన్సును గురించి ప్రస్తావన వచ్చినపుడు పరిశీలన, ప్రయోగం, ఫలితాలు అనేవేగాదు. మరోమాట కూడా విన్పిస్తుంటుంది. మనం రోజూ తిరగేసే పత్రికల్లో రకరకాల సైన్సు వార్తలు వస్తుంటాయి.
'ఫలానా అంతరిక్ష పరిశోధనా రంగంలో ఫలానా అంతరిక్ష యాత్రికుడి పరిశీలన ద్వారా సాపేక్ష సిద్ధాంతాన్ని సవాలు చేసే సాక్ష్యాలు లభించాయి.'
'డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఫలానా దేశపు విద్యావ్యవస్థ పాఠ్యపుస్తకాల్లో యథాతథంగా ఉంచడాన్ని వ్యతిరేకించింది.
'సరికొత్త క్వాంటమ్ సిద్ధాంతం ఇక్కడే ఉన్న నిన్ను ఇక్కడ లేవని చెప్పగల్గుతుంది.
ఈ వాక్యాల్లో కన్పించే 'సిద్ధాంతం' అంటే ఏమిటి?
17వ శతాబ్దపు తొలిరోజుల్లో శాస్త్ర విప్లవం వెల్లివెరుస్తున్న కాలంలో 'శాస్త్రీయ పద్ధతి' అనే మాట ప్రచారంలోకి వచ్చింది. సుప్రసిద్ధ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ దీని ప్రతిపాదకుల్లో ముఖ్యుడు. తర్వాత తర్వాత ఇది శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన పద్ధతి.
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
61