సైన్సు అంటే ఏమిటి? శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి?
సైన్సు అంటే ఏమిటి? శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి? శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడానికీ, ఇతర విధానంలో ఆలోచించడానికీ తేడా ఏమిటి? శాస్త్ర వేత్తలంటే ఎవరు? వాళ్ళ లక్షణాలేవిటి? వాళ్ళెలా ఆలోచిస్తారు? సైన్సును ఆచరించడం అంటే ఏమిటి? శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలు వేసుకోకుండా వీటికి జవాబులు వెతుక్కోకుండా సైన్సు గురించి మాట్లాడ్డం అంటే అది ఉబుసుపోక వ్యవహారమే అవుతుంది.
సైన్సు అంటే టెస్టుట్యూబులు కాదు. మొక్కలకు నామకరణాలు చెయ్యడమూ కాదు. సైన్సు అంటే ఒకానొక పద్ధతి ప్రకారం ఆలోచించడం. ఈ ప్రపంచాన్ని ఒకానొక ప్రత్యేక పద్ధతిలో చూడ్డం. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొన్ని సూత్రాలు రూపొందించుకొన్నారు. ఈ సూత్రాలు ఎంత విలక్షణమైనవంటే అవి ఈ శాస్త్రవేత్తల తప్పుల్ని కూడా ఎత్తి చూపుతాయి.
అది మనం చూసే వస్తువు కావచ్చు. వినే విషయం కావచ్చు. చేసే పరిశీలన కావచ్చు. ఎందులోనైనా సులభంగా పప్పులో కాలేసే అవకాశం కావల్సినంత ఉంది. అదెలా అంటారా?
అయితే కింది గీతల్ని చూడండి.
ఇవి రెండు సరళ రేఖలు. మొదటి దాని చివర బాణపు గుర్తులు బయటికి తెరచుకొని ఉన్నాయి. రెండో సరళ రేఖకు ఈ గుర్తులు లోపలికి ఉన్నాయి. వీటిలో ఏది పెద్దది? ఏది చిన్నది. చూడ్డానికి మొదటిది పెద్దదిగా ఉంది. కానీ కొలిచి చూడండి. రెండూ సమాసంగా ఉంటాయి. మరి మనం ఎందుకు పొరపడ్డాం?
దీన్నిబట్టి మనం పరిశీలించిదంతా సరైంది కాకపోవచ్చుననే నిర్ధారణకు మనం రావచ్చు. ఇలాంటి సందర్భంలో ఏది వాస్తవం అని మనం ప్రశ్నించుకోవాలి. 'ఈ వాస్తవాన్ని రుజువు చెయ్యడమెలా' అని కూడా మనం ప్రశ్నించుకోవాలి.
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
59