Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడిందనుకోండి. ఓ పుణ్య ముహూర్తాన సాక్షాత్తు మన బ్రోకాగారి మెదడూ (చనిపొయ్యాకే అనుకోండి) తూచారు. అది 1424గ్రాములే తూగింది. ఇంతటితో మెదడు బరువు' సిద్ధాంతం మూలపడింది.

అక్కడితో ఊరుకొన్నారా? మెదడు పై భాగాన ఎంత ఎక్కువ ముడతలుంటే అంత తెలివి గలవాడని మరో లాజిక్కు ముందుకు తెచ్చారు. కాలం గడిచేకొద్దీ మెదడు నిర్మాణం అందులోని భాగాలు వాటికీ మన మానసిక చర్యలకూ సంబంధం వెలుగులోకి రాసాగింది.

మనిషి మెదడు నిర్మాణం అత్యంత సంక్లిష్టమైంది. అందులో 10 తంత్రులుంటాయి. ఈ వ్యవస్థమున ప్రతి క్రియను, ఆలోచనలతో సహా నియంత్రిస్తుందని విదితమైంది. మెదడుని కింది భాగం, పైభాగం; కుడి ఎడమ భాగాలు అని కూడా విడదీసి చూడగల్గడం మొదలైంది. ఇవి ఒక్కో కార్యాన్ని ఒక్కోటి నియంత్రిస్తుందనీ తెలిసింది. దీని లోతుపాతులు ప్రస్తుతం మనకు అక్కర్లేదుగానీ ఒక్కో భాగాన్ని ఒక్కో పనికి (నైపుణ్యానికి) చూడ్డంతోనే ఇబ్బందులెదురవు తున్నాయి. మెదడుని ఒక సమగ్ర రూపంగా, అనుసంధానంతో పని చేసే ఓ సంక్లిష్ట రూపంగా చూడకుండా ముక్కలు చేసి చూడ్డం ఎంత సబబు అనే వాదం నేడు ముందుకొస్తోంది.

ఇంతకూ ఐన్‌స్టీన్ సంగతేమిటని మీరు ఆత్రుత పడుతుంటారు గదూ! ఆయన మెదడుని తూకం వేశాక ఏమీ తేలక పోవడంతో దాన్ని 200 చిన్న ఘనాకారాలుగా (పాపం శమించుగాక) కత్తిరించారు. వాటిని జాడీల్లో భద్రంగా మైక్‌మాస్టర్ విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. 20ఏళ్ళ పూర్వం 'సైండ్రా వైటెల్సన్ అనే ప్రొఫెసర్ గారి దృష్టి లక్షణంగా విశ్రాంతి తీసుకొంటున్న ఐన్‌స్టీన్ మెదడు ముక్కలపై పడింది. మళ్లీ కొలతలు, తూకాలు నిర్ధారణలు మొదలయ్యాయి.

వైటెల్సన్‌గారు తేల్చిందేమంటే ఐన్‌స్టీన్ మెదళ్ళో రెండు అసాధారణాంశాలున్నాయి. మొదటిది ఆయన మెదడు వెనకటిపై భాగం (పేరయిటల్ లబ్) మన సాధారణ మెదడుకన్నా పెద్దది! వికసించింది. ఈ భాగం గణిత క్రియను నియంత్రించేది గాబట్టి ఆయనకు E=mc2 తట్టింది! రెండో అసాధారణాంశం ఏమంటే టెంపోరల్ లాబ్ మధ్య ఉండాల్సిన ఒక సన్నటి కాలువ లాంటిది ఆయన మెదళ్లో లేదు. ఇది 'టెంపోరల్ లాబ్ 'పేరాయిటల్ లాబ్' లను విడదీస్తుంది. ఇది లేనందువల్ల రెండు లాబ్‌ల మధ్య 'సాన్నిహిత్యం' ఏర్పడి ఉండవచ్చు.

వైటెల్సన్ నిర్థారణ కొన్ని మౌలికాంశాల్ని మన ముందుకు తెస్తోంది. ఒకటి - మెదడు మానవ అస్తిత్వంలో ఒక భాగం కాదా? దీనికి బదులు మెదడు ముక్కల్ని 'కొలిచి' తెలివిని లెక్కించడమంటే వ్యక్తి సామాజిక అస్తిత్వం ఇక ఏమైనట్టు? రెండు - ఎవరి మెదడును పరిశీలించినా ఏదో ఒక ప్రత్యేకత వుండనే ఉంటుంది. దీన్ని 'అసాధారణాంశం'గా లెక్కించి దీనికీ తెలివికీ ముడిపెట్టడం ఎంత సబబు?

మూడవది - ఇప్పుడు మనం పిల్లలకు 'ఐక్యూ టెస్టులు' పెడుతున్నాం. నిజానికి ఒకానొక సందర్భంలో ఒకానొక అంశంపై ప్రదర్శించే తెలివిని సగటు ప్రతిభగా మనం లెక్కిస్తున్నాం. మరో సందర్భంలో మరో అంశంలో అతడు ఎందుకూ పనికి రాకపోవచ్చు. అపుడాతడి ప్రతిభ ఏమైనట్టు? నాల్గవది - తెలివి, ప్రతిభ, బుద్ధి అనేవి శరీర నిర్మాణంతో (అతి మెదడుతో కావచ్చు. డి.ఎన్.ఎ.లతో కావచ్చు) ముడిపెట్టి చూపెట్టడమంటే “జన్మతః ప్రతిభావంతు"డనే సిద్ధాంతానికి మళ్లీ (నాజీల తర్వాత) ప్రాణం పొయ్యడమే గదా! ఇదెక్కడికి దారితీసేట్టు?


'స్రోత్‌' ఆధారంగా

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

58