Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐన్‌స్టీన్ మెదడుతో మళ్ళీ కసరత్తు

పాపం ఐన్‌స్టీన్‌కు మళ్లీ కష్టాలొచ్చాయని ఆయన మెదడుని మళ్లీ కొలిచి ఆ మెదళ్లోంచి E=mc2 ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఆరా తీశారనీ మీరు పత్రికల్లో చదివి ఉంటారు. 1955లో ఐన్‌స్టీన్ మరణించిన 7 గంటలకే ఆయన పుర్రె నుంచి మెదడుని వేరుచేసి, తూకం వేసింది లగాయితు ఆ మేధావి మెదడు మీద కసరత్తు జరుగుతూనే ఉంది మరి.

కొందరు మనుషులు ఇంత 'అతి తెలివి'తో ఎలా ఉంటారని మానవుడు తన తెలివినంతా తగలేసి చాలారోజుల్నించి కుస్తీ పడుతున్నాడు. సైన్సు ప్రతిదాన్నీ 'కొలిచి' నిర్ధారించగలది గదా అందువల్ల తెలివిమంతుల తెలివి గుట్టు విప్పడానికి మొదట్లో పుర్రెల్ని కొలవడం మొదలెట్టారు. అమెరికాలో, యూరప్ ఈ వెర్రి మొదట పుట్టుకొచ్చింది. వీళ్ళకి నల్లవాళ్ళు తెల్లవాళ్ళ కంటె తెలివితక్కువ దద్దమ్మలని నిరూపించాలని ఎప్పటి నుంచో తహతహగా ఉండేది. 'పుర్రె పెద్దదిగా ఉంటే అందులో మెదడు పెద్దదిగా ఉంటుంది. మెదడు పెద్దదైతే తెలివి కావల్సినంత వుంటుంద'ని ఓ సిద్ధాంతం తయారు చేశారు.

ఇక చూసుకోండి తెల్లవాళ్ళంతా పుర్రెల మీద పడ్డారు. పుర్రెనిండా ఆవాలు పోసి, వాటిని తూకం వేసి ఆ పుర్రెలో ఎంత బరువైన మెదడు ఉందో లెక్కించడం మొదలెట్టారు. సగటు తూకాలు, తులనాత్మక తూకాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ ఆవాలు కూరికూరి పోస్తే ఎక్కువ గావచ్చు. లెక్కలు తారుమారు కావచ్చు. అందువల్ల అసలు మెదడునే ఊడబెరికి తూకం వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన 19వ శతాబ్దపు ప్రారంభంలో ఫ్రాన్సు శాస్త్రజ్ఞుడు 'పాల్‌బ్రోకా' మెదళ్లో పుట్టింది. మనిషి చచ్చాడని తెలిస్తే చాలు అక్కడ బ్రోకా ప్రత్యక్షమయ్యేవాడు. మెదడు వెలికితీసి చూచేవాడు. '2కి.గ్రా. మెదడైతే బాగా తెలివిగలవాడి మెదడు కింద లెక్క' అని ఆయనో సగటు లెక్క తయారు చేశాడు. దీంతో పండితులంతా 'మెదళ్ళ దానం' ప్రకటించసాగారు. వాళ్ళలో ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు గాస్‌గారూ ఉన్నారు. తీరా ఆయన మెదడు తూస్తే అది 1492 గ్రాములే ఉంది! అందరి గుండెల్లో రాయి

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

57