Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాన్నలకు నచ్చజెప్పి పారిస్‌లోని అలనాటి మొట్టమొదటి అంధుల పాఠశాలలో చేర్పించాడు. ఈ ఘటన ఆ పిల్లవాడి జీవితంలోనే కాదు చూపుకు నోచుకోని లక్షలాది అంధుల జీవితాల్ని ఒక మలుపు తిప్పుతుందని ఆనాడు ఆ ఫాదర్ కూడా ఊహించి ఉండడు.

ఆ పిల్లవాడెవ్వరో ఇప్పటికి మీరు కొంత ఊహించుకొని ఉంటారు. బ్రేలీ లిపిగా నేడు చలామణిలో ఉన్న అంధుల లిపికి ఆవిష్కర్త అతడేనని ఇతడి పేరు 'లూయీ బ్రైల్' అనీ మీరు గుర్తించి ఉంటారు. ఇంతకూ మన లూయీ వయస్సు ఆనాటికి పట్టుమని పది సంవత్సరాలే.

అంధులు చదవడానికి అక్షరాలు కాగితం మీద ఉబ్బుగా, తాకితే చేతికి తగిలేలా ఆ రోజుల్లో ఉండేవి. చదవాలంటే అన్నీ ఒకటిగానే చేతికి తగిలేవి. తేడా కనుక్కోవడం మహా కష్టంగా ఉండేది. పేజీకి పది అక్షరాలు కూడా పట్టేవి కాదు. అందువల్ల అంధుల కోసం పుస్తకాలు దొరికే అవకాశమే లేదు. ఇంతలో కెప్టెన్ బార్బియర్ ఆ స్కూలుకు వచ్చాడు. సైనికులు రాత్రులు చదివేందుకు ఆయన కనుగొన్న పద్ధతిని అక్కడ ప్రవేశపెట్టాడు. కాగితం మీద సూదితో రంధ్రాలు గుచ్చి, కాగితాన్ని వెనక్కు తిప్పి తడుముకొంటూ చదవడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత.

ఈ బార్బియర్ పద్ధతిని చూచినప్పటి నుంచి మన లూయీ ఎలాగైనా అంధులు ధారాళంగా చదవగల్గేలా ఒక లిపిని తయారు చెయ్యాలని దీక్షబూనాడు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అతని వెంట ఒక దబ్బనం ఉండేది. ఒక కొయ్యపలక, దళసరి కాగితం ఉండేవి. రాత్రింబవళ్ళు ఆయనకదే చింత, అదే తపన.

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

45