అంధకారంలోంచి అక్షర ప్రపంచంలోకి...
వెన్నముద్దల్లాంటి తెల్లటి మబ్బుల్ని తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాడు ఉన్నట్టుండి తూనీగల వెంబడి తుర్రుమంటున్నాడు. రంగు రంగుల సీతాకోక చిలుకల్ని వెంటబడి తరుముతున్న ఆ అల్లరి పిల్లడు పూలరంగుల్ని వాటి పుప్పొడిని శోధించి చూస్తున్నాడు...
ఇదంతా ఇప్పుడు ఒకనాటి మధురస్మృతి. అయిదేళ్ళ వయస్సుకే అతడికివన్నీ స్మృతుల' జాబితాలో చేరిపొయ్యాయి.
ఒక విషాదం అతని రెండు కళ్ళనూ బలిగొంది. వాళ్ళ నాన్న చర్మకారుడు. ఎవ్వరూ లేనపుడు కుతూహలం కొద్దీ చర్మాన్ని శుభ్రం చేసి, కత్తిరించే పరికరాల్ని పరిశీలిస్తూ, నున్నటి చర్మం మీద మొనదేలిన దబ్బనంతో ఏదో పిచ్చిగీతలు గీయబోతూ ఆ నిర్భాగ్యుడా దబ్బనాన్ని ఎడమకంటిలో గుచ్చుకొన్నాడు. ఆ గాయం సెలవేసి, రెండో కంటికీ ప్రాకి అతని జీవితాన్ని చిమ్మచీకటిమయం చేసింది. రెండు వందల యేళ్ళనాడు ఫ్రాన్సులో రెండు కళ్లూ పోగొట్టుకోవడమంటే భిక్షగాళ్ళ జాబితాలో చేరినట్టే లెక్క.
అయినా వాళ్ళ నాన్న తన కొడుకు దిక్కులేనివాడు కాగూడదని పట్టుపట్టాడు. ఒక సన్నటి చేతిబెత్తం తయారు చేసిచ్చాడు. దాని సాయంతో నడుస్తూ ఆ పిల్లవాడు తండ్రివద్దే చర్మం బాగుచేసి కత్తిరించి గుర్రపు జీనులు చెయ్యడం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కథ ఇక్కడితో ఆగిపోయి ఉంటే లోకంలోని లక్షలాది అంధుల చరిత్ర కూడా చీకట్లో చిక్కి నేటికీ విలవిలలాడుతుండేది.
ఇంతలో ఊళ్లోకి ఒక క్రైస్తవ ఫాదర్ వచ్చాడు. ఆ పసివాణ్ణి చేరదీసి స్కూలు మాస్టారికి నచ్చజెప్పి బళ్లో చేర్చాడు. ఏం విన్నా ఏకసంతాగ్రాహిగా ఇట్టే పట్టేసుకొంటున్న ఆ పిల్లవాణ్ణి ఆ బడితో ఆపెయ్యక పట్టుబట్టి, వాళ్ళమ్మా
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
44